కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కోలుకోలేని దెబ్బ తీసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. ఇలా అనేక దశల్లో కొత్త కొత్త స్ట్రెయిన్లతో సైంటిస్టులకే సవాల్ విసురుతోంది. అయితే ప్రపంచం ఇలాంటి మహమ్మారిలను ఎదుర్కోవడం కొత్త కాదు. గతంలో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఇలాగే లక్షల మంది చనిపోయారు. మరి స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయట పడ్డారు ? అంటే..
స్పానిష్ ఫ్లూ 1918లో వ్యాప్తి చెందడం ప్రారంభం అయింది. మొదటగా ఎక్కడ ఈ ఫ్లూ బయట పడిందో తెలియదు కానీ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఈ ఫ్లూ హెచ్1ఎన్1 అనే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చింది. దీనికి ఇప్పుడు మందులు ఉన్నాయి. కానీ అప్పట్లో లేవు. ఫిబ్రవరి 1918 నుంచి ఏప్రిల్ 1920 వరకు ఈ ఫ్లూ కొనసాగింది. దాదాపుగా 50 కోట్ల మందికి ఈ ఫ్లూ వ్యాప్తి చెందింది. మొత్తం 10 కోట్ల మంది వరకు ఈ ఫ్లూ కారణంగా చనిపోయి ఉంటారని అంచనా.
అయితే అప్పట్లో ఇప్పటిలా అధునాతన వైద్య సదుపాయాలు, రీసెర్చి చేసేందుకు అనువైన ల్యాబ్ లు లేని కారణంగా ఆ ఫ్లూకు మందును, టీకాలను కనిపెట్టలేదు. దీంలో స్పానిష్ ఫ్లూ నెమ్మదిగా తగ్గిపోయింది. జనాల్లో ఇమ్యూనిటీ వచ్చింది. చివరకు ఫ్లూ పూర్తిగా కనుమరుగైంది. ఆ తరువాత సుమారుగా 88 ఏళ్లకు.. అంటే.. 2008లో ఆ ఫ్లూ కారణమైన వైరస్‌లను గుర్తించి టీకాలను అభివృద్ధి చేశారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి వేరు. కోవిడ్‌ను అనేక దేశాలు జయించాయి. ఇప్పటికే పలు దేశాల్లో టీకాల పంపిణీ పూర్తి కావచ్చింది. భారత్‌లో జనాభా అధికం కనుక టీకాల పంపిణీకి ఇంకొంత కాలం పడుతుంది. కానీ కోవిడ్‌ను నిరోధించే టీకాలను మాత్రం అభివృద్ధి చేశారు. అందువల్ల స్పానిష్ ఫ్లూ మాదిరిగా ఎప్పుడు కరోనా తగ్గుతుందా ? అని వేచి చూడాల్సిన పనిలేదు. ఇప్పుడు మన ముందున్న మార్గం ఒక్కటే. వీలున్నంత మందికి వేగంగా టీకాలను వేయడం. అది ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. ఆ కార్యక్రమాన్ని ఎంత వేగంగా పూర్తి చేస్తే కోవిడ్‌ను అంత త్వరగా అంతమొందించవచ్చు. మరి ఆ సంతోష క్షణాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.