సైకాలజీ విద్యార్థులకి పాఠం చెప్పే ప్రొఫెసరు, ఒకరోజు క్లాసులోకి వస్తూ, తన చేతిలో సగం నీళ్ళున్న గ్లాసుని పట్టుకొచ్చాడు. అది చూసిన విద్యార్థులు మళ్ళీ పాత ప్రశ్నే అడిగేలా ఉన్నాడని అనుకున్నారు. గ్లాసు మీకెలా కనిపిస్తుంది? సగం నీళ్ళున్నాయా? సగం ఖాళీగా ఉందా అని అడుగుతాడనే అనుకున్నారు. కానీ వారందరి ఆలోచనలకి వ్యతిరేకంగా గ్లాసులో నీళ్ళు ఎంత బరువుగా ఉండవచ్చని అడిగాడు. ప్రశ్న ఇలా అడిగాడేంటని ఆశ్చర్యపోయిన విద్యార్థులు, తమ తోచిన విధంగా పావు కేజీ అని, దాని కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని అంచనా వేసారు.
ఐతే వాళ్ళ సమాధానాలని తప్పని చెప్పిన ప్రొఫెసరు, గ్లాసులో నీళ్ళ బరువు అనేది నీటి మీద ఆధారపడి ఉండదు. మనం దాన్ని ఎంతసేపు పట్టుకున్నామనేదాని మీద ఆధారపడి ఉంటుంది. నీళ్ళున్న గ్లాసుని ఎక్కువ సేపు పట్టుకుంటే ఎక్కువ బరువు ఫీలవుతాం. అదే టక్కున కిందపెట్టేస్తే అసలు బరువే ఫీల్ అవ్వం. అంటే ఎంత ఎక్కువ సేపు పట్టుకుంటే అంత ఎక్కువ బరువు ఉంటుందన్న మాట అన్నాడు. దానికి విద్యార్థులు షాకయ్యారు.
మీ జీవితం కూడా అంతే. జీవిత పయనంలో వచ్చే చిన్న ఒత్తిళ్ళని ఎక్కువ సేపు పట్టుకుని కూర్చుంటే అవి పెద్దవై పెరిగి పెరిగి, మీ జీవితాలనే నాశనం చేస్తాయి. ఎక్కువ సేపు గ్లాసుని పట్టుకుంటే చేతులు తిమ్మిరెక్కి పోయినట్టు, ఒత్తిడిని ఆశ్రయం ఎక్కువ సేపు ఇస్తూ పోతే అది మీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని దానిష్టం వచ్చినట్టు ఆట ఆడుతుంది. అందుకే ఎప్పుడైనా ఒత్తిడికి విలువ ఇవ్వకండి. దాన్ని పక్కన పెట్టేయండి. మీకెలాంటి కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులో ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మనిషిగా బాగుండగలుగుతారు.
లేదంటే ఒత్తిడి మీ మీద చూపించే ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంది. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.