హుజూరాబాద్ ఉపఎన్నికలో అనేక సిత్రాలు కనబడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రచారం జోరు అందుకుంది. అలాగే నామినేషన్ల్ పర్వం కూడా కొనసాగుతుంది. అయితే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని ఈటల రాజేందర్ బాగా కష్టపడుతున్నారు. బిజేపి తరుపున బరిలో దిగుతున్న ఈటల కమలం గుర్తుపై పోటీ చేయనున్నారు. అయితే ఇంతకాలం కారు గుర్తుపై పోటీ చేసిన ఈటల కమలం గుర్తుని హైలైట్ చేసేందుకు బాగా కష్టపడాల్సి వస్తుంది.
అటు ఈటలకు బిజేపి నుంచి అనుకున్న మేర మద్ధతు కూడా వస్తున్నట్లు కనిపించడం లేదు. కేవలం తన సొంత బలాన్ని నమ్ముకుని ఈటల ముందుకెళుతున్నారు. ఎందుకంటే హుజూరాబాద్‌లో సొంతంగా బిజేపికి పెద్ద బలం లేదు. సరే బలం లేకపోయిన ఈటలకు సపోర్ట్‌గా ఉండాలి. కానీ ఇలాంటి సమయంలో కూడా హుజూరాబాద్ బిజేపిలో లుకలుకలు ఈటలకు తపనొప్పిగా మారాయి. ఈటల గెలుపు కోసం కష్టపడాల్సిన నాయకులు ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ టౌన్ బిజేపి అధ్యక్షుడుగా మహేందర్ రెడ్డిని తప్పించారు. దీంతో మహేందర్ రెడ్డి వర్గం భగ్గుమంటుంది. ఇక ఈ పంచాయితీ అధ్యక్షుడు బండి సంజయ్ వరకు వెళ్లింది. మరి ఈ రచ్చ వల్ల ఈటలకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఆయన వర్గం ఆలోచనలో పడింది. కాకపోతే ప్రజల మద్ధతు ఉంది కాబట్టి ఈటల వర్గం భయపడటం లేదు.
ఇక అధికార టిఆర్‌ఎస్ పార్టీ…తన అధికార బలాన్ని ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగిస్తూ…ముందుకెళుతుంది. ఈటల గెలుపుని ఎలాగైనా అడ్డుకోవాలని కిందా మీదా పడుతుంది. గెలిచే వరకు కారు రేసు ఆపకూడదని అనుకుంటుంది. కానీ రేసింగ్‌లో కారుకు ఎక్కడ పంక్చర్లు పడతాయో అని డౌట్ కూడా ఉంది. ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే…కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించిన కూడా ఇంకా ప్రచారంలో దూకలేదు. అసలు ఎక్కడా కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా హుజూరాబాద్‌లో పోటీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.