అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయింది. హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం ప్రారంభమైన మెట్రోకు నాలుగేళ్లు నిండింది. 2017 నవంబర్ 28 తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైల్ తొలిదశ ప్రారంభమైంది. ప్రస్తుతం 3 మార్గాల్లో 4 దశల్లో 69.3కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. సగటున రోజూ.. 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
ఇదిలా ఉంటే కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్లు గానే హైదరాబాద్ మెట్రో రైల్ పై కూడా పడింది. కరోనా లాక్ డౌన్ల తో మెట్రోకు భారీగా నష్టాలు వచ్చాయి. కరోనా సమయంలో 169 రోజుల పాటు మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మెట్రో సేవలు ప్రారంభమైనా… గతంలో లాగా ప్రయాణికులు రావడం లేదు. కొవిడ్ కారణంగా మెట్రోరైలుకు వచ్చిన ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేలా సాయం చేయాలని ఎల్ అండ్ టీ (L&T)… రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదిలా ఉంటే ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చేందుకు, నష్టాలను తగ్గించుకునేందుకు ఇటీవల మెట్రో రైల్ సమాయాలను కూడా పెంచింది. ఉదయం 6 గంటలకు మొదటి సర్వీసు ప్రారంభం కాగా… 11 గంటలకు చివరి మెట్రో రైల్ నడిపేలా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు.