ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల పొత్తుల గురించి అనేక చర్చలు వస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయంటూ ప్రచారం జరిగింది… కానీ ఇప్పుడు సీన్ మారింది. అసలు పొత్తు లేదని ప్రచారం వస్తుంది. పైగా చంద్రబాబు..పవన్‌తో కలవడానికి ఆసక్తిగానే ఉన్నారు..కానీ పవన్ మాత్రం కలవడానికి ఆసక్తిగా లేరని బాబు మాటలు బట్టి అర్ధమవుతుంది. అంటే పొత్తుకు టీడీపీ రెడీనే కానీ…జనసేన మాత్రం రెడీగా లేదు.
అటు బీజేపీ సైతం పొత్తుకు సిద్ధంగా లేదు…బాబు అవకాశవాది అని చెప్పి సోము వీర్రాజు లాంటి వారు మాట్లాడుతున్నారు. ఇటు జనసేన నేతలు సైతం…టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదని చెప్పేస్తున్నారు. పొత్తు లేకుండానే తాము సత్తా చాటుతామని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ జనసేన నుంచి మరొక చర్చ వస్తుంది. ఆసక్తికరంగా పవన్ సీఎం అవ్వడానికి ఒప్పుకుంటే టీడీపీతో కలుస్తామని జనసేన నేతలు చెబుతున్నారు.
అంటే ఇక్కడ టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకోవాలంటే… పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్ధి అని ప్రకటించాలి…ఇక చంద్రబాబు సీఎంగా ఉండటానికి లేదు. అందుకు ఒప్పుకుంటేనే తాము పొత్తుకు అంగీకరిస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. అదే సమయంలో జనసైనికులు ఇంకో డిమాండ్ కూడా తెరపైకి తెస్తున్నారు. 175 సీట్లలో 75 సీట్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రెండు ఆప్షన్స్ టీడీపీ ఒప్పుకుంటుందా? అంటే అసలు ఏ మాత్రం ఒప్పుకోదు. అసలు తాము సింగిల్‌గానే పోటీ చేసి అధికారం సాధిస్తామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
ఇప్పటివరకు సింగిల్‌గానే పోరాడుతూ వచ్చామని, స్థానిక ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒంటరిగానే బరిలో దిగమని అంటున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా సింగిల్‌గానే పోటీ చేసి గెలుస్తామని అంటున్నారు. అయితే వాస్తవానికి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు పెద్ద బలం లేదనే సంగతి తెలిసిందే. పొత్తులో పోటీ చేస్తే ఎక్కువ సీట్లు రావొచ్చు…కానీ పొత్తు లేకుండా అయితే ఓట్లు చీలిపోయి జనసేన కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మరి టీడీపీ-జనసేనల పొత్తు ఏం అవుతుందో చూడాలి.