ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీ మార్పు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందా

-

ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొంత కాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న డేవిడ్ రాజు సొంత గూటికి చేరాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు పార్టీని వదిలి వెళ్లిన రాజుకి వ్యతిరేకంగా…నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. డేవిడ్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ తమ నిర్ణయాన్ని అధిష్టానానికి పంపుతున్నారు. దీంతో డేవిడ్ రాజు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందా అన్న చర్చ నడుస్తుంది.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ..మళ్లీ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న బూదాల అజితారావు గత ఎన్నికల్లో ఓటమి తరువాత నియోజక వర్గానికి దూరమయ్యారు. దీంతో ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ గా మరొకరిని నియమించేందుకు టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో సారి టీడీపీలో చేరి ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ పదవి దక్కించుకునేందుకు డేవిడ్ రాజు ప్లాన్ చేశారు.

వైసీపీ నుండి టీడీపీలో చేరాలని డేవిడ్ రాజు అనుచరులతో సమావేశాలు పెట్టినా…వైసీపీ నేతలు స్పందించలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, డేవిడ్ రాజు వైసీపీలో తిరిగి ఎప్పుడు చేరారో కూడా తెలియదంటూ జిల్లా మంత్రి బాలినేని సెటైర్లు వేశారు. డేవిడ్ రాజు పార్టీ మారే వ్యవహారాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకోకపోయినా…ఎర్రగొండపాలెం టీడీపీ శ్రేణులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. డేవిడ్ రాజు టీడీపీలో చేరికని వ్యతిరేకిస్తూ ఎర్రగొండపాలెంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారం అనుభవించిన డేవిడ్ రాజు ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారని ఆరోపిస్తున్నారు. డేవిడ్ రాజుని టీడీపీలో చేర్చుకోవద్దంటూ కొంత మంది ఎర్రగొండపాలెం లీడర్లు టీడీపీ అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టారు.

అధికార పార్టీ వైసీపీపై అసంతృప్తిని వెళ్ల గక్కిన డేవిడ్ రాజుకి ఎర్రగొండపాలెం టీడీపీ శ్రేణుల నుండి వస్తున్న వ్యతిరేకత ఇబ్బందిగా మారింది. ఒక వైపు వైసీపీలో ఉండలేని పరిస్థితి…మరో వైపు టీడీపీ క్యాడర్ నుండి వస్తున్న వ్యతిరేకత డేవిడ్ రాజుకి తలనొప్పిగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news