సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా? చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళిలు జగన్‌ని కలిసి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారా? అంటే వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తోంది…సమస్యలే పరిష్కారం అయ్యేలా లేవు. అసలు సినీ ఇండస్ట్రీకు సంబంధించి సమస్యని సృష్టించిందే జగన్ ప్రభుత్వం…దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సినిమా టిక్కెట్ల రేట్లని భారీగా తగ్గించారు. ఇతర పన్నులు పెంచి ప్రజలపై భారం పెంచిన ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లు మాత్రం తగ్గించి పేదల కోసం చేశామని చెప్పింది.
1990ల కాలంలో ఉన్న టిక్కెట్ల రేట్లని ఇప్పుడు పెట్టారు…దీంతో సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోవడం ఖాయం. అందుకే వెంటనే చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు జగన్‌ని కలిసి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడానికి చూశారు. మరి జగన్ ప్రభుత్వం ఏం అనుకుందో…సినీ ఇండస్ట్రీ అంతా తమ వద్దకు రావాలని అనుకుందేమో…అందుకే చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివలు జగన్‌ని కలవడానికి వచ్చారు. అలాగే సినీ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడారు.
అలాగే ఐదు షోలకు అనుమతి, పెద్ద సినిమాలకు సెపరేట్‌గా టిక్కెట్ల రేట్లు, సినీ ఇండస్ట్రీ వస్తేవిశాఖలో స్థలాలు కూడా ఇస్తానని జగన్ చెప్పారు. అయితే చర్చల్లో అంతా సవ్యంగా జరిగినట్లే కనిపించింది..కానీ అతి కీలకమైన సినిమా టికెట్ ధరలపై జగన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అదేమంటే ఈ నెలలోనే గుడ్ న్యూస్ వింటామని సినీ హీరోలు చెప్పారు.
ఒకవేళ ఆ గుడ్ న్యూస్ గాని రాకపోతే బాలయ్య-పవన్ కల్యాణ్‌ల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు…పైగా జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారు…అందుకే వీరిని చర్చలకు ఆహ్వానించలేదు. అయితే నెక్స్ట్ ఏమన్నా తేడా వస్తే మాత్రం ఈ ఇద్దరు తీవ్రంగానే స్పందించేలా ఉన్నారు..ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. మరి తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే వీరి రియాక్షన్ వేరుగా ఉండే ఛాన్స్ ఉంది.