ప్రస్తుత తరుణంలో చాలా మందికి సిగరెట్లు తాగడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా యువత సిగరెట్లను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఒకర్ని చూసి ఒకరు సిగరెట్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిత్యం వారు డబ్బాల కొద్దీ సిగరెట్లను కాల్చి పారేస్తున్నారు. అయితే.. సిగరెట్ తాగడం వల్ల ఇప్పటి వరకు ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయని అందరూ భావించారు. కానీ సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనలో తెలిసిందేమిటంటే.. సిగరెట్లు బాగా తాగితే కంటి చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని వారు చెబుతున్నారు.
నిత్యం 20 కన్నా ఎక్కువగా సిగరెట్లు తాగితే కంటి చూపు కోల్పోతారని రట్గెర్స్ రీసెర్చ్ సంస్థకు చెందిన సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధనల వివరాలను సైకియాట్రీ రీసెర్చ్ జర్నల్‌లోనూ ప్రచురించారు. సైంటిస్టులు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న 71 మందిపై పరిశోధనలు చేశారు. వారందరూ సిగరెట్లు తాగేవారే. వారిలో 63 మంది రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతారట. ఈ క్రమంలో వారికి క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్‌పై వస్తున్న చాలా రంగుల్ని చూపించారు. ఆ సమయంలో వారు తెరపై వచ్చిన ప్రధాన రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను సరిగ్గా గుర్తించకలేపోయారు.
ఇక ఆ 63 మందికి కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. వారు ప్రధానంగా సిగరెట్లను బాగా తాగడం వల్లే కంటి చూపు సమస్యలు వచ్చాయని సైంటిస్టులు నిర్దారించారు. సిగరెట్లలో ఉండే న్యూరోటాక్సిక్ కెమికల్స్ కళ్లపై ప్రభావం చూపిస్తాయని, అందువల్లే కంటి చూపు పోతుందని, అయితే దీన్ని పట్టించుకోకుండా సిగరెట్లను అదే పనిగా తాగితే కంటి చూపు పూర్తిగా పోయి అంధత్వం వస్తుందని కూడా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కనుక.. సిగరెట్ ప్రియులారా.. ఇకపై మీరు సిగరెట్ తాగినప్పుడు గుర్తుంచుకోండి.. కంటి చూపు సమస్య వస్తుందని..! అలాగైనా సిగరెట్ తాగడం మానేస్తారు..!