దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. బుధవారం (ఏప్రిల్ 9వ తేదీ) నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. పలు చోట్ల పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు.
ఏప్రిల్ 9 నుంచి 12 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, యానాం, కేరళ, మాహే, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీ, కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని.. రానున్న కొన్ని రోజుల పాటు తూర్పు, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో పలుచోట్ల బలమైన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.