తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరిట గచ్చిబౌలిలో ప్రారంభించిన సర్కార్ దవాఖాన పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. రెనోవేషన్ పేరుతో, కరోనా తర్వాత ఈ దవాఖానలో ఇన్‌పేషెంట్ సేవలు పూర్తిగా బంద్ పెట్టారు అధికారులు. ఆసుపత్రిలోని డాక్టర్లు, ఇతర స్టాఫ్‌ను నగరంలోని ఇతర దవాఖాన్లకు పంపించారు అధికారులు. ప్రస్తుతం ఇక్కడ అవుట్ పేషెంట్ సేవలు మాత్రమే అందిస్తుండగా, అది కూడా అరకొరగానే మారిందని ఆసుపత్రికి వస్తున్న రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు అరకొరగా ఉండటంతో.. సగటున రోజూ 50 మందికి మించి పేషెంట్లు రావడం లేదు. ఇన్‌పేషెంట్ సర్వీస్ బంద్ పెట్టి 6 నెలలు అవుతున్నా, ఇప్పటికీ అక్కడ రెనోవేషన్ పనులు పూర్తి కాకపోవడం శోచనీయం.
ఇప్పుడు అసలు అక్కడ పనులేవి జరగడం లేదు. ఐదుగురు డాక్టర్లు, 18 మంది స్టాఫ్ నర్సులు సహా మొత్తం 70 మంది మంది స్టాఫ్ మాత్రం పనిచేస్తున్నారు. పేషెంట్ల సంఖ్య అరకొరగానే ఉండడంతో, వీళ్లకు కూడా అక్కడ పెద్దగా పనేమీ లేదు. ఇదే విషయమై హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. ఇప్పట్లో ఆ హాస్పిటల్‌ను రీఓపెన్ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఓపీ సేవలు పూర్తిగా బంద్ పెడ్తే, ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున ఓపీ మాత్రం కంటిన్యూ చేస్తున్నామని చెబుతున్నారు అధికారులు.