మొత్తంగా తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ అయోమయానికి తెరపడింది. అటు టీఆర్ఎస్… ఇటు కాంగ్రెస్ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది. పీకే కాంగ్రెస్ లో చేరితే..తమతో ఎలా పని చేస్తారని టీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ లో ఉండికూడా టీఆర్ఎస్ కు ఎలా పనిచేస్తారనే శషభిషలు రెండు పార్టీల్లోనూ లేకుండా పోయింది.
అదే సమయంలో.. బీజేపీకి కూడా పీకే వంకతో విమర్శలు చేసే అవకాశాలు మూసుకుపోయాయి. అందుకే పీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా..టీఆర్ఎస్ పొత్తుపెట్టుకున్నా అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పేర్కొన్నారు. అయ్యో ఎదురుదాడికి అవకాశం లేకుండా పోయిందన్నదే ఆయన మాటల్లోని అంతరార్థమని కాస్త తెలివి ఉన్న వారికి ఎవరికైనా బోధపడుతుంది.
దీనిని పక్కన పెడితే.. ఇప్పుడు తెలంగాణలో సరికొత్త పోరు మొదలైంది.గురుశిష్యుల మధ్య యుద్ధం మొదలైంది. ఎవరా గురుశిష్యులు? ఏమా కథా? అని ఆలోచించకండి. ఎందుకంటే వారిద్దరూ.. ప్రశాంత్ కిశోర్, కనుగోలు సునీల్. పీకే దగ్గర పని చేసిన సునీల్.. కొద్ది రోజుల క్రితం వేరుపడి సొంత కుంపటి పెట్టుకున్నారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తరపున పని చేస్తున్నారు. మరోవైపు.. టీఆర్ఎస్ తో పీకే కలిసి పని చేయడం పక్కా అయిపోయింది.
టీఆర్ఎస్ తరపున ఇప్పటికే పీకే రంగంలోకి దిగారు. సర్వేలు నిర్వహిస్తున్నారు.నియోజకవర్గాల వారీగా నివేదికలు పార్టీ అధినేత కేసీఆర్ కు చేరుతున్నాయి. అదే సమయంలో… సునీల్ కూడా కాంగ్రెస్ తరపున రాష్ట్రంలో మకాం వేశారు. నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురుశిష్యుల మధ్య పోరు ఎలా ఉండనుంది. తమ తమ పార్టీలను గెలిపించుకోవడంలో వారు ఏ మేరకు విజయం సాధిస్తారు? గురువుదే విజయమా? శిష్యుడిదే గెలుపా? అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.