ఉప్పల్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,500 మంది సిబ్బంది గస్తీలో పాల్గొననున్నారు. మైదానం చుట్టూ.. వాహనాల పార్కింగ్, తనిఖీలు చేసే చోట సహా మొత్తం 300 సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షించనున్నారు. వేలాది మంది తరలొస్తున్న నేపథ్యంలో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
ప్రేక్షకులు చరవాణులు మినహా ఎలాంటి వస్తువులు వెంట తీసుకురావొద్దని సీపీ సూచించారు. స్టేడియం లోపలికి ల్యాప్‌టాప్, బ్యానర్లు, నీళ్ల సీసాలు, కెమెరాలు, సిగరెట్టు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టె, లైటర్, పదునైన సామగ్రి, బైనాక్యులర్లు, నాణేలు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్, పర్ఫ్యూమ్, బ్యాగులు, బయటి తినుబండారాలపై నిషేధం. ప్రేక్షకులు తీసుకొచ్చే మొబైల్ ఫోన్ల తనిఖీకి ప్రతిగేటు దగ్గర నలుగురు సాంకేతిక సిబ్బందిని నియమించారు.