బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. లిజ్ ట్రస్ రాజీనామాతో రిషికి లైన్ క్లియర్ అవ్వడంతో ఆయన ఏకగ్రీవంగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ కూడా రిషికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా తన అల్లుడి విజయంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి స్పందించారు. రిషి సునాక్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషికి నా శుభాకాంక్షలు. ఆయనపట్ల చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసిస్తున్నాను’ అని నారాయణ మూర్తి అన్నారు.
రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి.. నారాయణ మూర్తి కుమార్తె. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే సమయంలో ఆమెకు రిషితో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మనసులు కలవడంతో పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.