రైతులకు సంబంధించి ఎన్ని రకాల బీమాలున్నాయో తెలుసా..?

-

మనకు తెలిసిన బీమాలు ఎల్ఐసీ బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. ఇవే కాకుండా బీమాలో అనేక రకాలున్నాయని మీకు తెలుసా.. ముఖ్యంగా రైతుల కోసం చాలా రకాల బీమాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్షకుల కోసం ఎన్నో రకాల ఇన్సూరెన్సులను అందజేస్తున్నాయి. వీటి ద్వారా రైతులకు భద్రత కల్పిస్తున్నాయి. ఓవైపు విపత్తులు, మరోవైపు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులతో పంటనష్టాలతో కుంగిపోతున్న రైతులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. ఇంతకీ రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు ఏంటంటే..?

farmers

రైతు బీమా, పంట బీమా అనే పథకాలు కర్షకుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు. రైతు బీమా అంటే రైతుకు ఇన్సూరెన్స్ కల్పిస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ రైతు చనిపోతే వారి కుటుంబానికి డబ్బులు వస్తాయి. కొన్ని రాష్ట్రాలు ఉచితంగా రైతులకు బీమా సదుపాయం కల్పిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు బీమా కల్పిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రైతులు సగం ప్రీమియం చెల్లిస్తే.. మిగతా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి.

ఇక పంట బీమా విషయానికొస్తే.. అకాల వర్షం, వరదలు, వాతావరణంలో మార్పుల వల్ల రైతులకు పంటకు నష్టం జరిగినప్పుడు పంట బీమా ద్వారా పరిహారం చెల్లిస్తారు. కేంద్ర మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపోయినప్పుడు రైతులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి పథకాలను అందిస్తున్నాయి. ఏపీలో వైఎస్సార్ పంట బీమా పథకం ద్వారా, తెలంగాణలో రైతు బీమా ద్వారా ప్రభుత్వం పరిహారం అందిస్తోంది.

రైతులు, పంటలకే కాదు పాడిసాగుకు సంబంధించిన బీమాలు కూడా ఉంటాయి. అనారోగ్యంతో పశువులు మృత్యువాత పడటం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా.. కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే పశువుల బీమా పథకం. ఈ పథకం అర్హతలు ఏంటి.. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేవిషయాల గురించి తెలుసుకుందాం.

దేశీయ, క్రాస్, బ్రిడ్ జాతులకు చెందిన పశువులకు బీమా అందిస్తారు. పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎడ్లకు బీమా సదుపాయం ఉంది. ఈ బీమా తీసుకోవాలంటే పశువు అప్పటి మార్కెట్ విలువ మొత్తానికి ఏడాది 4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రీమియం చెల్లిస్తే పశువు ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు బీమా చేసే సమయంలో సంబంధిత పశువు మార్కెట్ విలువ ఎంతైతే ఉందో అంత మొతాన్ని పరిహారంగా ఇస్తారు. పాలు ఇవ్వని పశువులకు మాత్రం మార్కెట్ విలువలో 75 శాతాన్ని పరిహారంగా ఇస్తారు. మార్కెట్ విలువను రైతు, పశువైద్య అధికారి, బీమా కంపెనీల యాజమాన్యం సమక్షంలో నిర్ణయిస్తారు.

అగ్ని ప్రమాదం, వరదలు, తుపానులు, భూకంపం లాంటి ప్రమాదాల వల్ల చనిపోయిన పశువులకు బీమా పరిహారం వస్తుంది. ఇక వివిధ రకాల వ్యాధులు, సర్జరీ చేసే సమయంలో పశువులు చనిపోతే బీమా అందుతుంది.

బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి ఏం పత్రాలు కావాలంటే.. పశువైద్యుడు ధృవీకరించిన పశువు ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే పత్రం, పశువు వయస్సు, దాని ఆరోగ్య పరమైన వివరాలు, మార్కెట్ విలువ, గుర్తింపు మచ్చలకు సంబంధించి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news