ఏపీలో ఇంటిలిజెన్స్ వైఫల్యం పై ఆసక్తికర చర్చ

-

ఏపీ ఇంటెలిజెన్స్‌ పని తీరు మీద అధికారిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నడూ కనివినీ రీతిలో పెద్ద ఎత్తున దేవాలయాలు.. దేవతా మూర్తుల విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే ఇప్పటి వరకు సరైన కారణాన్ని కనిపెట్టలేకపోయింది ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే కచ్చితంగా పక్కా ప్రణాళిక ప్రకారం చేసినట్టే కన్పిస్తోంది. కానీ వీటి మూలాలను కనిపెట్టడంలో ఏపీ నిఘా విభాగం దారుణంగా ఫెయిల్‌ అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికార వర్గాల్లోను ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఏపీలోని ఇంటెలిజెన్స్‌ పనితీరు మీద ఇటు రాజకీయ వర్గాల్లోనూ.. అటు అధికారిక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి గందరగోళం జరుగుతుంటే ఈ ఆగడాలకు మూలాలేంటీ అనే విషయాన్ని ఇంటెలిజెన్స్‌ వింగ్‌ ఎందుకు పసిగట్టలేకపోతోందనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మిగిలిపోయిందనే చర్చ జరుగుతోంది. చిన్న చితకా ఘటనలు మినహాయిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఠాపురం దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధం, దుర్గగుడిలో మూడు సింహాల చోరి, రామతీర్ధం వంటి ఘటనల వెనుక ఎవరు ఉన్నారు..? ఇవి ప్రణాళికా బద్దంగా జరుగుతున్న సంఘటనలా..? లేక కాకతాళియంగా జరుగుతున్న పరిణామాలా…? అనేది ఇదమిద్దంగా తేల్చ లేకపోతోంది నిఘా విభాగం. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా..? లేక రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఏమైనా కుట్ర జరుగుతుందా..? అనే విషయాన్ని పసిగట్టడంలో ఘోరంగా ఫెయిల్‌ అయింది నిఘా వ్యవస్థ.

ఏ ప్రభుత్వానికైనా కళ్లు.. ముక్కు.. చెవులుగా పని చేయాల్సింది ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి..? రాష్ట్రంలో అలజడి రేకెత్తించేందుకు ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా..? అధికారుల పనితీరు ఏ విధంగా ఉందీ.. ప్రజా ప్రతినిధుల వ్యవహర శైలి ఎలా ఉంది అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీయడం ఇంటెలిజెన్స్‌ విధులు. అలాగే అసాంఘీక శక్తుల కదలికలను ఓ కంట కనిపెట్టడం కూడా ఇంటెలిజెన్స్‌ ప్రధాన బాధ్యత. కానీ ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం ఈ స్థాయిలో ఎక్కడ తన విధులు నిర్వహిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు.

జగన్‌ సర్కార్‌ కొలుపు తీరి సుమారు 19 నెలలు కావస్తోంది. ఇప్పటికీ కొత్త ప్రభుత్వం సరైన ఇంటెలిజెన్స్‌ టీమ్‌ను సెట్‌ చేసుకోలేకపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. జగన్‌ పరిపాలనా పగ్గాలు చేపట్టిన కొత్తలో స్టీఫెన్‌ రవీంద్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ కేడర్‌ మార్పు వల్ల అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో అప్పటికే ఇంటెలిజెన్స్‌ ఛీప్‌గా వ్యవహరించిన కుమార్‌ విశ్వజిత్‌నే కొన్నాళ్ల పాటు కొనసాగించింది ప్రభుత్వం. అయితే ఆ తర్వాత సదురు అధికారి పని తీరు సరిగా లేదని.. మనీష్‌ కుమార్‌ సిన్హాను నియమించారు. అయితే ఆ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఎంకే సిన్హాకు ఉద్వాసన పలికింది ప్రభుత్వం. ఆయన ఉద్వాసన తర్వాత రాజేంద్రనాధ్‌ రెడ్డిని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు.

అయితే వీరెవ్వరూ కూడా గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలను పసిగట్టడంలో అట్టర్‌ ఫెయిల్యూర్‌ అయ్యారనే చెప్పాలి. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ టీమ్ అంతా సోషల్‌ మీడియా చుట్టూనే తిరుగుతోంది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను.. కథనాలను.. అప్డేట్స్‌ చూసుకోవడం.. వాటిని విశ్లేషించుకోవడం.. వాటి ఆధారంగా ఏవో కొన్ని నివేదికలు ప్రభుత్వానికి.. ప్రభుత్వ పెద్దలకు చేరవేయడం మినహా మరేం చేయడం లేదనే చెప్పాలి. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనే అంశంపై ఫోకస్ పెట్టడం లేదనే చెప్పాలి. ఇపుడిదే అంశంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తే బావుంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news