టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఉరఫ్ చినబాబు తెలివికి చప్పట్లు కొట్టాల్సిందే! అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. దీంతో అసలు ఏం జరిగింది? ఆయనపై ఎందుకిలా సటైర్లు పేలుతున్నాయనే అంశం చర్చగా మారింది. తాజాగా నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై స్పందించారు. ముఖ్యంగా సీఎం జగన్‌ను ఆయన విమర్శించారు. సరే! రాజకీయాల్లో ఉన్నవారు విమర్శలు చేయడం సహజం. ముఖ్యంగా రెండోసారి కూడా అదికారంలోకి రావాలని కలలు కని.. అవి విఫలమయ్యాయి కాబట్టి. తాము కలలో కూడా ఊహించని విధంగా వైసీపీ అధినేత జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించాడు కాబట్టి ఆమాత్రం టీడీపీ నాయకులు విమర్శలు చేయకుండా ఉంటారని అనలేం!
అయితే, సదరు విమర్శలు మాత్రం ఆచి తూచి చేస్తే.. ఎవరూ కాదనరు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించిందంటూ.. టీడీపీని కొనియాడతారు కూడా! అయితే, దాదాపు రెండు నెలల తర్వాత మైకు పట్టుకున్న లోకేష్ అంతర్గత వ్యవహారంలో వైసీపీ ప్రస్థావ నతీసుకువచ్చారు. ప్రస్తుతం కరోనానేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని ఆయన అనేశారు. అంతేకాదు, అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పొగిడేయడం ఇప్పుడు నెటిజన్లకు నవ్వులు తెపిస్తోంది. “కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.
ఇక్కడ జగన్ 30 వేల కోట్ల అదనపు నిధులు ఉంచుకుని కూడా ఉద్యోగులకు జీతాలలో కోత పెట్టాడు. అంతేకాదు, మాస్కులు, శానిటైజర్లు అందించడంలో విఫలమయ్యాడు. జగన్ వేస్ట్!“- అని విమర్శించారు. ఇక, అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో కరోనాను తరిమికొట్టిందని అన్నారు. ప్రజలకు రూ.1500 ఇస్తున్నారని, అయితే, ఏపీలో కేవలం 1000 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. కేంద్రం చేసిందే ఎక్కువని, జగన్ ప్రభుత్వం చేసింది ఏమీలేదని దుయ్యబట్టారు. ఇవే ఇప్పుడు లోకేష్‌తెలివి చప్పట్లు కొట్టాల్సిందే! అనే వ్యాఖ్యలకు కారణమైందని అంటున్నారు పరిశీలకులు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
ఇప్పటికే మూడువందల కేసుల దిశగా తెలంగాణ పరిగెడుతోంది. పైగా అక్కడి ఉద్యోగుల జీతాల్లో సగానికిపైగా కోత విధించిన కేసీఆర్ ఎప్పుడు ఇస్తారనే విషయం చెప్పనేలేదు. ఏపీలో కోత పెట్టినా.. దానిని తర్వాత ఇస్తానని జగన్ స్వయంగా ప్రకటించారు. ఇక, ఏపీలో వలంటీర్ల వ్యవస్థ కారణంగా కేసులను పట్టుకునేందుకు ప్రభుత్వం సులువుగా ప్రయత్నిస్తోంది. ఇన్ని సానుకూలతలు ఏపీలో కనిపిస్తుంటే.. లోకేష్‌కు మాత్రం ఏ ఒక్కటి కనిపించకపోవడంపై చప్పట్లు కొట్టి అభినందించాల్సిందే అంటున్నారు నెటిజన్లు! మరి మనం కూడా కొట్టేద్దామా చప్పట్లు!!