రాష్ట్రంలో ఓ కీలక అంశంపై ఆదివారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ సాగింది. అయితే, అది సాధారణంగా.. ప్రస్తుతం ప్ర ప చాన్ని కరోనా వైరస్ ఒణికిస్తున్న నేపథ్యంలో దానిపైనే అందరూ చర్చించుకుంటున్నారు కనుక… మన దగ్గర కూడా దానిపైనే చర్చసాగి ఉంటుందని అనుకుంటారు. కానీ, దానిపై కాదు! ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. దీంతో టీడీపీలో అనేక సంవ త్సరాలు రాజకీయ చక్రం తిప్పిన నాయకులు ఆదివారం పార్టీ ఉనికి, మనికిపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి రిటైర్ అయినవారు. సానుభూతి పరులు, పార్టీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కూడా పార్టీ పరిస్థితిపై తమదైన శైలిలో విశ్లేషణలు గుప్పించారు.
మరి వారి సారాంశం అంతా కూడా ఒక్కటే.. టీడీపీ బతికి బట్టకట్టాలన్నా.. ఇక, ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇక కోలుకోలేని పరిస్థితికి మరింత కూరుకుపోవాలన్నా కూడా అంతా కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ చేతిలోనే ఉందని అంటున్నారు! అదేంటి? అంటే.. అక్కడే ఉందని చెబుతున్నారు వారంతా. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాది ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ విజయం సాధించి తీరుతామని అనుకున్న చంద్రబాబు కర్ర విడిచి సాము చేశారనే వాదన ఉంది.
ఇక జగన్ కూడా అప్పట్లో తక్కువగా అంచనా వేశారు. ఆయనను నేరస్తుడిగా చూపించాలని అనుకున్నారే తప్ప.. గతంలో బందిపోటు రాణి పూలన్ దేవి కూడా ప్రజల ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టిన విషయం ఆయనకు గుర్తుకు రాలేదు. అదేసమయంలో పాలకపక్షం ఇప్పుడు దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళతారు అనే అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతున్నది. అయితే, ఈ 10 నెలల కాలాన్ని గమనించినట్లయితే.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ భవిష్యత్తు పరిణామాల గురించి బెంగపడకుండా(అంటే పార్టీ మారిన వారు మారుతున్నా.. పోయే వారు పోతున్నా కూడా) ప్రస్తుత ప్రజాసమస్యలపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
అధికారపక్షం తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలావరకు విజయం సాధించింది. జరిగిన లోపాలను సరిచేసుకొని తెలుగుదేశం ఇదే ఊపును కొనసాగించి తన పూర్వ వైభవం సాధించ గలుగుతుందా? అంటే.. ఇప్పుడు పార్టీ సీనియర్లు, సానుభూతి పరులు చెబుతున్న దాని ప్రకారం అంతా జగన్ ప్రభుత్వం అనుసరించే వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ప్రజల్లో వైసీపీ ఆదరాభిమానాలు కైవసం చేసుకుంటే.. మరోసారి వైసీపీనే వస్తుందని, లేకుంటే టీడీపీకి ఎడ్జ్ ఉంటుందని చెబుతున్నారు. సో.. ఇదీ మేటర్!!