రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడిని ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పని వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించింది. దీనిపై వైట్ హౌజ్ స్పందించింది. రష్యా ఆరోపణలను కొట్టిపారేసింది. క్రెమ్లిన్‌పై దాడి గురించి రష్యా చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బే ఎద్దేవా చేశారు. రష్యా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ తన సరిహద్దుల అవతల దాడులు చేయడాన్ని అమెరికా ఎప్పటికీ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి వెనుక ఎవరున్నారనే విషయాన్ని కనుక్కోవడానికి యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు యత్నిస్తున్నారని చెప్పారు.
రెండు రోజుల క్రితం రష్యా రాజధాని మాస్కో నగరం నడిబొడ్డున ఉన్న క్రెమ్లిన్ భవనాలపైకి రెండు డ్రోన్‌లు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి యత్నం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాలో ఎక్కడెక్కడ దాడి చేయాలనే విషయాలను ఉక్రెయిన్‌కు అమెరికా చెబుతోందని, అమెరికా సూచన మేరకు ఉక్రెయిన్ నడుచుకుంటోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఆరోపించారు.