అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని గుర్తు తెలియని ఓ ప్రైవేటు కారు ఢీ కట్టింది. ఈ ఘటన అగ్రరాజ్యంలో కలకలం రేపింది. ఏకంగా అధ్యక్షుడి కాన్వాయ్ను ఢీ కొట్టడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
శ్వేతసౌధం తెలిపిన వివరాల ప్రకారం.. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ ఆదివారం రాత్రి డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వద్దకు వారు వస్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చి యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటన జరిగిన సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. బైడెన్ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్‌ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లి వెంటనే వైట్ హౌస్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.