చైనా దూకుడు.. తైవాన్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం

-

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీ తైవాన్​ పర్యటనపై చైనా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే తైవాన్​ భూభాగం చుట్టూ సైనిక విన్యాసాలను ప్రారంభించిన చైనా పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ.. తైవాన్​ ఈశాన్య, నైరుతి ప్రాంత జలాల్లో డాంగ్​ఫెంగ్​ బాలిస్టిక్​ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని తైవాన్​ రక్షణశాఖ సైతం ధ్రువీకరించింది.

అంతకుముందు నాన్సీ పర్యటన అనంతరం తైవాన్‌ను చుట్టిముట్టిన చైనా సైన్యం, వైమానికదళం, నౌకాదళం, వివిధ అనుబంధ బలగాలతో కలిసి భారీ ఎత్తున సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాలు తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ జరుగుతున్నాయి. లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యం అని చైనా అధికారిక వార్తా సంస్థ షిన్హువా పేర్కొంది.

గురువారం నుంచి ఆదివారం వరకు ఈ డ్రిల్స్ కొనసాగనున్నాయి. లక్ష్యాలపై మిస్సైల్స్ ప్రయోగించడం కూడా డ్రిల్స్​లో భాగమని తెలుస్తోంది. ఈ విన్యాసాల కోసం తైవాన్‌ చుట్టూ ఆరు కీలక ప్రదేశాలను ఎంపిక చేసినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అయితే తైవాన్‌కు కేవలం 12 మైళ్ల దూరంలోనే ఈ డ్రిల్స్‌ జరగనున్నట్లు చైనా మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి.. తైవాన్‌ జలాలు, గగనతలంలోకి తమ నౌకలు, విమానాలను పంపించట్లేదని డ్రాగన్‌ చెబుతోంది.

మరోవైపు ఈ కథనాలపై తైవాన్‌ రక్షణశాఖ స్పందించింది. చైనా మిలిటరీ విన్యాసాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపింది. యుద్ధం వంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంది. అయితే, అలాంటి పరిస్థితులను తాము కోరుకోవట్లేదని తెలిపింది. ఘర్షణలను రెచ్చగొట్టి వివాదానికి కారణమవడం తమ విధానం కాదని స్పష్టం చేసింది.

చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమైంది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్​ను చేపడుతోంది. అమెరికా నావికాదళం తైవాన్​కు సమీపంలో పలు నౌకలను మోహరించింది. తైవాన్​కు అండగా నిలుస్తామని అమెరికా పదేపదే చెబుతున్న నేపథ్యంలో.. తాజా పరిణామాలను ప్రపంచదేశాలు తీక్షణంగా గమనిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news