సిరియాలోని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) గ్రూప్ చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీని తాము మట్టుబెట్టినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ నేషన్‌నల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ నిన్న తమ దేశంలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ చనిపోయాడని తెలిపారు. తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇతడి కోసం ఎంతోకాలంగా వెతుకుతోందని చెప్పారు.
సిరియాలోని స్థానిక, ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఉత్తర సిరియాలోని జందారిస్ పట్టణంలో ఈ దాడి చోటుచేసుకొన్నట్లు సమాచారం. ఈ ప్రాంతం టర్కీ నేతృత్వంలోని రెబల్స్ ఆధీనంలో ఉంది. మరో వైపు అక్కడి ప్రత్యర్థి వర్గమైన సిరియన్ నేషనల్ ఆర్మీ మాత్రం ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
సిరియాలో స్థానికుల కథనం ప్రకారం శనివారం రాత్రి జందారిస్ పట్టణంలో భారీగా కాల్పులు మొదలయ్యాయి. దాదాపు గంట సేపు ఏకధాటిగా సాగిన కాల్పులు ఓ పెద్దపేలుడుతో ముగిశాయి. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఈ దాడిలో అబు హుస్సేన్ అల్ ఖురేషీ మృతిచెందినట్లు తేలింది. అతడు తప్పించుకోవడానికి మార్గం లేకపోవడంతో తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి చేసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.