జైలులో ఘర్షణ.. 51 మంది ఖైదీలు మృతి!

కొలంబియాలోని ఓ జైల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో 51 మంది ఖైదీలు మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తులువా నగరంలోని కారాగారంలో ఖైదీలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పరుపులకు కొందరు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దాంతో వారంతా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు.

ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 51 మంది ఖైదీలు మృతి చెందారు. ఇవి ప్రాథమికంగా నిర్ధారించినవే. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కొలంబియా జాతీయ జైళ్ల శాఖ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో జైలులో 1,267 మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్ లో 180 మంది ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాధితుల బంధువులకు తన సంఘీభావం తెలియజేస్తూ కొలంబియా అధ్యక్షుడు ట్వీట్ చేశారు.