కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో ఇద్దరు ప్లేయర్లు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన ముగ్గురు సిబ్బంది కోవిడ్ బారిన పడ్డాక ఐపీఎల్ జరుగుతుందా, లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై బీసీసీఐ అధికారికంగా ఇంకా ప్రకటన ఇవ్వకపోయినా బీసీసీఐ పెద్దలు మాత్రం ఐపీఎల్ కొనసాగుతుందనే మీడియాకు స్పష్టం చేశారు. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
ఇంత వరకు వచ్చాక ఐపీఎల్ ను ఆపేది లేదని, సగం టోర్నమెంట్ పూర్తయిందని, కనుక ఇప్పుడు టోర్నమెంట్‌ను ఆపలేమని, కాబట్టి ముందుకే కొనసాగాలని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. అయితే కోల్‌కతా ప్లేయర్లను బయట వైద్య పరీక్షల నిమిత్తం తరలించినప్పుడు కోవిడ్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆ టీమ్‌ను ఐసొలేట్ చేశారు.
ఇక కోవిడ్ కేసుల నేపథ్యంలో ఐపీఎల్‌లో మరింత పటిష్టమైన బయో సెక్యూర్ బబుల్‌ను అమలు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్లేయర్లు బయో సెక్యూర్ బబుల్‌లో కచ్చితంగా ఉండాల్సిందేనని, నిబంధనలను ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘించరాదని ఫ్రాంచైజీలు స్పష్టం చేశాయి. అయితే గత వారం రోజుల కిందట ఆస్ట్రేలియాకు చెందిన పలువురు ప్లేయర్లు టోర్నీని వీడి వెళ్లిపోయారు. దీంతో ఐపీఎల్‌లో ఆడుతున్న మిగిలిన ప్లేయర్లు కొంత ఆందోళన చెందారు. కానీ బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్నారు కదా, ఇబ్బంది ఉండదు అని సర్ది చెప్పుకున్నారు. అయినప్పటికీ ఐదు మంది కోవిడ్ బారిన పడడం విదేశీ ప్లేయర్లలో మళ్లీ ఆందోళనను పెంచుతోంది. అయితే ఈ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.