మనలో చాలా మంది ట్రైన్ జర్నీ చేసే ఉంటాం. రైలులో కాలక్షేపం కోసం స్నాక్స్, టీ, వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తుంటాం. అందుకు విక్రేతలు మన దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తారు. కామన్ గా అయితే.. ప్రొడక్ట్ పై ఎమ్మార్పీ ఎంత ఉంటుందో అంతే మొత్తాన్ని వసూలు చేయాలి. కానీ కొంత మంది అలాంటి రూల్స్ ను ఏ మాత్రం పట్టించుకోరు. నెగ్లెక్ట్ గా బిహేవ్ చేస్తుంటారు. డిమాండ్ ఉన్నా లేకున్నా అడ్డగోలుగా రేట్లు పెంచేసి ప్యాసింజర్స్ కు చుక్కలు చూపిస్తుంటారు. అయితే.. హర్యానాకు చెందిన ఓ ప్యాసింజర్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే సదరు రైల్వే కాంట్రాక్టర్ కు గట్టి గుణపాఠం నేర్పాడు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నాడంటూ వీడియో తీసి రైల్వే ఉన్నతాధికారులకు పంపించాడు.
దీంతో ఆ కాంట్రాక్టర్ కు భారీ మొత్తంలో జరిమానా విధించారు ఉన్నతాధికారులు. హర్యానాకు చెందిన శివం భట్ ఇటీవల లక్నో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించాడు. చండీగఢ్ నుంచి షాజహాన్ పూర్ కు వెళుతున్నాడు. రైలు ప్రయాణం మధ్యలో దాహమేసి ఓ వాటర్ బాటిల్ కొనేందుకు ప్రయత్నించాడు. అయితే, బాటిల్ పై ఎమ్మార్పీ రూ.15 మాత్రమే ఉండగా.. బాటిల్ ను రూ.20 కి అమ్ముతున్నారని గుర్తించాడు. ఇదేంటని అడిగితే.. కావాలంటే తీసుకో లేదంటే వదిలెయ్ అన్నట్లు జవాబిచ్చాడా కుర్రాడు.
మరో దారిలేక అడిగినంతా ఇచ్చి శివం భట్ వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అయితే, ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ఆపై దానిని రైల్వే ఉన్నతాధికారులకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారి రైల్వే ఉన్నతాధికారులకూ చేరడంతో వాళ్లు స్పందించారు. లక్నో ఎక్స్ ప్రెస్ లో నీళ్ల బాటిళ్ల అమ్మకానికి లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ ను అరెస్టు చేసింది. ఎమ్మార్పీకన్నా ఎక్కువ ధరలకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నందుకు రూ.లక్ష జరిమానా విధించింది.