దూకుడు మంచిదే.. అనుకుంటారు. రాజకీయ నేతలు. అయితే, ఆదూకుడు అన్ని సమయాల్లోనూ మంచిది కాదని అనేక సందర్భాల్లో చరిత్ర నిరూపించింది. అయినా కూడా చాలా మంది నాయకులు మారింది, మారుతున్నది కూడా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎదురై.. రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థం చేసుకున్నారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా రెడ్డి. రాజకీయాలకు తాను కొత్తే అయినా.. తన కుటుంబ రాజకీయాలను చూసుకుని ఆవేశంతోనే ఆమె బొక్క బోర్లా పడ్డారు.
భూమా నాగిరెడ్డి కుమార్తెగా రాజకీయాల్లో వచ్చిన అఖిల.. తన తండ్రి నుంచి నేర్చుకున్న రాజకీయాలు ఏమీ లేవనే చెప్పాలి. నాగిరెడ్డి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గేవారు. ఎక్కడ ఎగరాలో అక్కడ ఎగిరేవారు. కానీ, అఖిల మాత్రం ఆది నుంచి కూడా ఎగరడమే తప్ప.. తగ్గింది కానీ, సమయానికి అనుకూలంగా మార్పులు చేర్పులతో రాజకీయాలను చేసింది కానీ.. మనకు కనిపించదు. సొంత పార్టీలోనే సీనియర్లతో కయ్యం పెట్టుకున్నారు. ఒకటి కాదు.. రెండు నియోజకవర్గాల్లోనూ తనే ఆధిపత్యం చేయాలనుకున్నారు. మంత్రిగా తనకు పోస్టు రావడం వెనుక తనేదో సాధించేశాను అనే ఆలోచనతో వ్యవహరించారన్న టాక్ కూడా ఆమెపై ఉండేది.
ఫలితంగా సొంత పార్టీలోనే ఎవరికీ కాని నాయకురాలిగా మారిపోయారు. ఇప్పుడు ఆమె టీడీపీలోనే ఉన్నప్పటికీ.. కనీసం పార్టీ అధినేత చంద్రబాబు అప్పాయింట్‌మెంట్ కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని నంద్యాలలోనే వినిపిస్తోంది. పోనీ.. పార్టీ తరఫున బాబు ఇస్తున్న కార్యక్రమాలకు హాజరు కావాలని అనుకున్నా.. ఆమెకు కలిసి వచ్చే కార్యకర్తలు, నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అఖిల ప్రియ పరిస్థితి దారుణంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది ఎన్నికల్లో ఓటమి ఇప్పటికీ ఆమెను వెంటాడుతోంది. పైగా ఆమె భర్తపై హత్యాయత్నం కేసు నమోదు కావడం, చంద్రబాబు పట్టించుకోక పోవడం వంటివి అఖిలకు రాజకీయంగా భవితవ్యం లేకుండా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇక ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలో తన పెదనాన్న కుమారుడు అయిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితోనూ ఆమెకు పొసగని పరిస్థితి ఉంది. నంద్యాలలో బ్రహ్మానందరెడ్డిని తప్పించేసి అక్కడ కూడా తన సొంత సోదరుడికి పార్టీ పగ్గాలు అప్పగించేలా చక్రం తిప్పుతోందన్న టాక్ ఉంది. దీంతో ఆమె అటు జిల్లాలో మిగిలిన నేతలతో పాటు ఇటు సొంత కుటుంబానికి కూడా దూరం దూరం అవుతోన్న పరిస్థితి ఉంది.