లోకేష్ పాదయాత్రకు బ్రేకులు..నిర్ణయం వారిదే?

-

లోకేష్ పాదయాత్రకు బ్రేకులు పడతాయా..ఆయన పాదయాత్ర మధ్యలోనే ఆగిపోనుందా? అంటే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో టి‌డి‌పి శ్రేణుల్లో అదే అనుమానం వస్తుంది. తాజాగా 14 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 9 స్థానిక సంస్థలు..మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది.  షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది.

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం గ్రాడ్యుయేట్ స్థానాలకు.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు,  కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే దాదాపు అన్నీ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ ఉండేలా ఉంది. అయితే ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది.

ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్‌… రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌ కుమార్‌ మీనాకు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ విషయంలో లోకేష్ పాదయాత్ర, వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడంపై సందేహం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అంటే పాదయాత్ర ద్వారా గాని, గడపగడపకు వెళ్ళడం ద్వారా గాని ఓటర్లని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కాకపోతే పాదయాత్ర అనేది ఎన్నికల కోడ్‌లోకి రాదని కొందరు అంటున్నారు.

స్థానిక సంస్థలని పక్కన పెడితే..ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటర్లుగా ఉండటంతో..వారిని ఆకర్షించే ప్రచారాలు కూడా కోడ్ పరిధిలోకి వస్తాయని కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి చివరికి లోకేష్ పాదయాత్రపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..అటు గడపగడపకు బ్రేకులు వేస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version