రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నరు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఆయనకు ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. ఆయన ఏమైనా పొద్దు తిరుగుడు పువ్వా? అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళతారా? అని ఎద్దేవా చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించామని, తానే స్వయంగా వచ్చి ప్రార్థిస్తే ప్రజలు రంజిత్రెడ్డిని గెలిపించారని కేసీఆర్ గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసం అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి తెలంగాణ సాధించినం, 10 సంవత్సరాల పాటు అధికారం ఇస్తే అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇవాళ అవన్నీ నా కళ్ల ముందే పోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.నేను ఒక్కటే మాట చెప్తున్న, నేను బతికి ఉన్నా అన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తా తప్ప నోరు మూసుకొని కూర్చోను అని కేసీఆర్ అన్నారు.