ఎవరికైనా ఎస్బీఐ చెక్‌ ఇస్తున్నారా..? పాజిటీవ్ పే సిస్టమ్‌తో చెక్‌ చేయండి

-

డిజిటల్‌ టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ క్రమంలో.. మన పనులన్నీ చాలా తేలిక అవుతున్నాయి. క్షణాల్లో డబ్బులు అకౌంట్స్‌ మారిపోతున్నాయి. ఇదే టైమ్‌లో.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. లావాదేవీల కోసం చెక్స్ ఇచ్చేవారికి, చెక్ పేమెంట్స్ చేసేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోయినా, ఇప్పటికీ ట్రాన్సాక్షన్స్ కోసం చెక్స్ ఇస్తున్నవారు చాలామందే ఉన్నారు. అయితే చెక్కుల మోసాలు బాగా జరుగుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల క్రితం పాజిటీవ్ పే సిస్టమ్ తీసుకొచ్చింది.

చెక్ తీసుకొని డబ్బులు ఇవ్వడం, చెక్ బదిలీ చేయడం, చెక్ క్లియర్ చేయడం లాంటి లావాదేవీల్లో మోసాలకు బ్రేక్ వేసేందుకు ఉపయోగపడే పద్ధతి ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా చాలాకాలంగా పాజిటీవ్ పే సిస్టమ్‌ను అమలు చేస్తోంది. ఎస్‌బీఐ పాజిటివ్ పే సిస్టమ్ చెక్ మోసాన్ని నిరోధించడానికి బ్యాంకు అమలు చేస్తున్న భద్రతా చర్యగా చెప్పుకోవచ్చు. చెక్ ట్యాంపరింగ్ లాంటి మోసాల నివారణకు ఇది ఉపయోగపడుతుంది.

పాజిటివ్ పే సిస్టమ్‌లో చెక్‌లోని వివరాలను బ్యాంక్‌కి తిరిగి ధృవీకరించాల్సి ఉంటుంది. చెక్‌ను ప్రాసెస్ చేసి చెల్లింపులు జరిపే సమయంలో ఈ వివరాలను బ్యాంకు క్రాస్ చెక్ చేస్తుంది. చెక్ మోసం నుంచి కస్టమర్లను పాజిటివ్ పే సిస్టమ్ కాపాడుతుంది. ఎస్‌బీఐ పాజిటివ్ పే సిస్టమ్‌లో రెండు స్టెప్స్ ఉంటాయి. అందులో ఒకటి అకౌంట్ రిజిస్ట్రేషన్, రెండోది లాడ్జ్‌మెంట్ ఆఫ్ చెక్.

పాజిటివ్ పే సిస్టమ్ వాడుకోవాలనుకునే కస్టమర్లు సూచించిన ఫార్మాట్‌లో దరఖాస్తును బ్యాంకులో సమర్పించి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సేవింగ్స్ అకౌంట్ అయితే రూ.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన చెక్కులకు, కరెంట్ అకౌంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్‌ డ్రాఫ్ట్ లాంటి అకౌంట్లు అయితే రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన చెక్కులకు పాజిటివ్ పే సిస్టమ్ తప్పనిసరి.

ఇక కస్టమర్లు ఎవరికైనా చెక్ ఇస్తే ఆ వివరాలను బ్యాంకుకు వెల్లడించాలి. అందులో అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ తేదీ, చెక్‌పైన రాసిన అమౌంట్, బెనిఫీషియరీ పేరు, ఇన్‌స్ట్రుమెంట్ టైప్ లాంటి వివరాలను బ్యాంకుకు వెల్లడించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ ద్వారా ఈ వివరాలు బ్యాంకుకు వెల్లడించవచ్చు. వివరాలన్నీ సరిగ్గా ఉంటేనే లావాదేవీ పూర్తి చేస్తుంది. ఒకవేళ చెక్ పైన ఉన్న వివరాలు, మీరు వెల్లడించిన వివరాలు సరిపోలనట్టైతే బ్యాంకు ఆ చెక్కును తిరస్కరిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో రిటర్న్ ఛార్జీలు వర్తించవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version