తుఫాను గండం దాటావా జ‌గ‌న్ !

-

గండాలు ఎన్న‌యినా దాటేందుకు తాను సిద్ధ‌మేన‌ని అంటున్నారు యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన తుఫానుల‌ను స‌మ‌ర్థంగానే ఎదుర్కొన్నాన‌ని విశ్వాసంతో కూడిన మాట ఒక‌టి చెప్పి వెళ్తున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఆ విధంగా ఆ రరోజు అంఫ‌న్, ఇవాళ అస‌ని లాంటి తీవ్ర తుఫానుల నుంచి ఒడ్డెక్కేందుకు తాను కృషి చేశాన‌ని కూడా చెబుతున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌బాబు హ‌యాంలో ఏర్ప‌డిన రెండు తీవ్ర తుఫానులు (ఒకటి హుద్ హుద్, రెండు తిత్లీ) క‌న్నా ఇవి తీవ్రత విష‌య‌మై కాస్త త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ, గాలుల కార‌ణంగా జ‌రిగే న‌ష్టాల నివార‌ణ‌కు, ముఖ్యంగా ప్రాణ న‌ష్ట నివార‌ణకు, భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంపు ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు, ఇంకా కొన్నింటి విల‌య నివార‌ణ చ‌ర్య‌ల విష‌య‌మై ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని చెబుతున్నారు సీఎం. ఇక తిత్లీ బాధితుల పరిహారం ఇవాళ్టికీ చెల్లించ‌లేద‌ని టీడీపీ వ‌ర్గీయులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఏది ఎలా ఉన్నా గండం గ‌ట్టెక్కితే తీరం సుర‌క్షితం అయితే జ‌గ‌న్ హాయిగా ఊపిరి పీల్చుకోవ‌చ్చు.

ముఖ్యంగా తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌లో న‌ష్టాల అంచ‌నా అన్న‌ది ఇప్పుడిక కీల‌కం. పంట‌లు పోయాక రైతులకు అండ‌గా నిల‌వాల్సిన కేంద్రం కానీ రాష్ట్రం కానీ పెద్ద‌గా చేస్తున్న సాయం ఏమీ లేదు. ముఖ్యంగా వ‌రితో స‌హా జీడి,మామిడి తోట‌ల సాగుతో ఆదాయం పొందే ఉద్దానం వ‌ర్గాలు తుఫానుతో న‌ష్ట‌పోయేది ఎక్కువే! వీరికి గ‌తంలోనూ పెద్ద‌గా ఆర్థిక సాయం అందిన దాఖ‌లాలు లేవు. కేంద్ర బృందాలు న‌ష్టాల వివ‌రాలు రాసేట‌ప్పుడు కానీ రాష్ట్ర బృందాల స‌ర్వేలో కానీ ప్రామాణిక‌త అన్న‌ది పెద్ద‌గా ఉండ‌డం లేదు.

ఇలాంటి సంద‌ర్భాల్లో రైతుల‌కు ఆస‌రాగా నిల‌వాల్సిన ప్ర‌భుత్వాలు మాత్రం కంటి తుడుపుగా మాత్ర‌మే నిధులు ఇచ్చి ప‌రిహారం పేరిట డ‌బ్బులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. తుఫాను వెళ్లిపోయాక ఇళ్లు పోయిన బాధితులు నిరాశ్ర‌యులుగా ఉండిపోవ‌డం మిన‌హా వారికి త‌క్షణ సాయం అందించేందుకు స‌ర్కారు తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏమీ లేవు. వీటిపై దృష్టి సారిస్తే చంద్ర‌బాబు కన్నా జ‌గ‌న్ బాబు బాగా ప‌నిచేశార‌ని నిరూప‌ణ అవుతుంది. లేదంటే ప్ర‌క‌ట‌న‌లే మిగులుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news