మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం బండి మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్‌తో దోస్తీ చేసేది మేము కాదు కేసీఆరే అని కేటీఆర్‌కు వివరించారు. చీకట్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి డబ్బు సంచులు అప్పగించారని ఆరోపించారు. అంతేకాకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు కూడా కేసీఆర్ డబ్బు మూటలు పంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి రేవంత్ రెడ్డితో దోస్తీ చేయాల్సిన అవసరం లేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. కేటీఆర్‌కు ఉన్న అహంకారంతోనే బీఆర్ఎస్‌కు ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఆ బాధ భరించలేకే కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితం అయ్యారని గుర్తుచేశారు.కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌కు దోస్తీ లేకుండానే ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం కేసులు అటకెక్కాయా? అని ప్రశ్నించారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకే చీకట్లో కేసీఆర్ సంచుల పంపిణీ చేశారని ఆరోపించారు. లేనియెడల బీఆర్ఎస్ నేతలు జైలులో ఉండేవారని విమర్శించారు.