మునుగోడు ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ కు సిపిఐ మద్దతు తెలిపింది. ఈరోజు జరిగే సభకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఐ నేతలను కోరారు. మునుగోడు సభకు హాజరుకావాలని సిపిఐ నిర్ణయించింది. అయితే సిపిఐ నిర్ణయం పై మండిపడ్డారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నారాయణపురం మండలం పోర్లగడ్ల తండాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులుు అమ్ముడుపోతున్నారని.. వాళ్లకు గుణపాఠం చెప్పాలని, వాళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు కూడా అమ్ముడుపోవడం దురదృష్టకరమని అన్నారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టుల కిల్లా అని.. ఇన్నాళ్లు మీరు చేసిన పోరాటాలు వృధా అయిపోతాయని అన్నారు రేవంత్ రెడ్డి. కోదండరాం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యేవరకు వారితో కలిసి పోరాడతానన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కొరకు కాంగ్రెస్ పెద్దలను కూడా రంగంలోకి దింపుతానన్నారు రేవంత్ రెడ్డి.