వైసీపీ నేతలపై జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారా? నేతల వ్యవహార శైలిపై ఆయన ఒకింత ఆగ్రహంతోనూ ఉన్నారా? అంటే.. తాజాగా జరిగిన కేబినెట్ చర్చలను పరిశీలించిన వారికి ఔననే అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వివిధ సందర్భాల్లో భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ విజృంభిస్తున్నారు. అయితే.. అసెంబ్లీ వేదికపై వచ్చే సరికి మాత్రం.. ఎవరూ పెద్దగా చొరవ చూపడం లేదు. దీంతో పలు సందర్భాల్లో అధికార పక్షం కన్నా.. టీడీపీదే అసెంబ్లీలో పైచేయిగా కనిపిస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు జగన్ స్పందిస్తూనే ఉన్నారు. చాలా మంది మంత్రులకు సబ్జెక్టు ఉండడం లేదని కూడా అంటున్నారు.
అయినా కూడా మంత్రుల్లోనూ.. నాయకుల్లోనూ మార్పు కనిపించడం లేదు. దీంతో తాజాగా జగన్ మరోసారి ఇదే అంశాన్ని చూచాయగా ప్రస్తావించారు. కేబినెట్ లో పలవురు మంత్రులు వీరావేశంతో మాట్లాడారు. సార్.. మా నియోజకవర్గంలో టీడీపీ నేతలకు కళ్లెం వేయలేక పోతున్నాం.. అంటూ.. ఒకరిద్దరు చెప్పడం ప్రారంభించేసరికి.. ఏదైనా ఉంటే.. మీరు కూడా అదే రేంజ్‌లో మాట్లాడాలి అని జగన్ సూచించారు. ఇక, కొందరు సభల్లో బాగానే మాట్లాడుతున్నారని.. ప్రతిపక్షాలకు కౌంటర్లు వేస్తున్నారని.. అయితే.. దానికన్నా కూడా సభలో మాత్రం గళం వినిపించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సూచించారు.
ఒకరిపై ఒకరు దూషణలకు దిగడాన్ని ఈ సందర్భంగా జగన్ సీరియస్‌గా పేర్కొన్నారు. ఇది అసంబద్ధమని అన్నారు. పార్టీలైన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. వేదికలపై కాదబ్బా.. మీ సత్తా ఏమైనా ఉంటే.. సభలో వినిపించండి అని జగన్ సూచించారు. అంతేకాదు.. కొందరు మహిళా మంత్రులను ఉద్దేశించి కూడా ఆసక్తికర కామెంట్లు చేసినట్టు గుసగుస వినిపిస్తోంది. అసలు సబ్జెక్టు కూడా లేకుండా సభలకు వస్తున్నారని.. దీనిని ఇక నుంచి సహించేది లేదని జగన్ కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. ఇలా మొత్తంగా జగన్ ఆచితూచి మాట్లాడుతూనే.. నేతలకు చురకలంటించారని అంటున్నారు వైసీపీ నేతలు.