వచ్చే ఎన్నికల్లో జగన్‌ను దింపేయాలి. అవసరమైతే.. అన్ని పార్టీలూ కలిసి కట్టుగా ఏకమై.. ఎన్నికల్లో పోటీకి దిగాలి. ఇదీ.. ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్, జనసేన కూడా అనుకుంటున్న మాట. కుదిరితే.. బీజేపీ కలుస్తుంది. లేకపోతే.. తామైనా.. కలిసి కట్టుగా జగన్ సర్కారును దింపేయాలని నాయకులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఓకే.. జగన్‌పై తిరుగుబావుటా ఎగరేసేందుకు.. ఆయనను ఎన్నికల్లో ఓడించేందుకు ఈ పార్టీలు సంయుక్తంగా కదిలేందుకు రెడీ అవుతున్నాయనే అనుకుందాం. ఇది.. 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మహాకూటమిని తలపించేలా నాయకులు ముందుకు ఉరుకుతున్నారని అనుకుందాం.
కానీ, జగన్ వ్యూహాన్ని తట్టుకునేలా మాత్రం ఈ పార్టీలు ముందుకు సాగే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. ఇప్పటికే జగన్ అనేక పథకాలతో రాష్ట్రంలో పందేరాలు చేశారు. ప్రతి పథకం.. ఏదో ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని కొనసాగిస్తున్నదే. వచ్చే ఎన్నికల్లో వీటిని కొనసాగించాల్సిన అవసరం అన్ని పార్టీలపైనా ఉంది. ఈ విషయంలో రాజీ పడితే.. ఆయా సామాజిక వర్గాల నుంచి పెద్ద విపత్తే వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలోనే.. దీనికి సంబంధించిన హామీలు గుప్పించాలి. అవి కూడా జగన్‌ను మించిన స్థాయిలో ఉండాలి.
పోనీ.. ఈ హామీలు ఇద్దామా? అంటే.. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. దీనిని దృష్టిలో పెట్టు కుంటే.. ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగించే పరిస్థితి లేక జగన్ సర్కారు తికమకపడుతోంది. ఈ క్రమంలో..వచ్చే ఎన్నికల నాటికి.. ఈ అప్పులు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీలన్నీ ఏకమైనా.. జగన్ వ్యూహానికి తగిన విధంగా మాత్రం అడుగులు వేసే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
అంతేకాదు.. క్షేత్రస్థాయిలో పింఛన్లు.. పెంచితే.. ఇక, జగన్ కు తిరుగు ఉండదనే సంకేతాలు వస్తున్నాయి. మారుతున్న కాలంలో వ్యక్తిగత లబ్ధిని కోరుతున్న ఓటర్లు.. జగన్ వైపే మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎన్ని పార్టీలు కలిసినా.. ఏమీ చేయలేవని.. వైసీపీ నేతలు సైతం ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.