అరవై వేల కోట్లతో అదానీ గ్రూపు పెట్టుబడులు పెట్టేందుకు, ఆంధ్రా ప్రగతికి కారణం అయ్యేందుకు నిన్నటి వేళ ముందుకు వస్తే ఆ చర్యలకు కొనసాగింపుగా మిగిలిన స్వదేశీ కంపెనీల పెద్దలూ ఆ కోవలోనే వెళ్తున్నారు. ఆ విధంగా స్వదేశీ కంపెనీలు అన్నీ పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రావనిని భావిస్తున్నారు అని జగన్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దావోస్ లో జగన్ చేస్తున్న ప్రతి ప్రయత్నం ఫలిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ వివరం ఈ కథనంలో..
దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో వివిధ కంపెనీల ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతినిధులు భేటీ అవుతున్నారు. ఆంధ్రా తరఫున జగన్ నెగోషియేషన్స్ నెరపుతున్నారు. అవన్నీ మంచి ఫలితాలే ఇస్తున్నాయి.
స్వదేశీ కంపెనీలకు అధినేతలయిన గౌతమ్ అదానీ, ఆదిత్య మిట్టల్, గుర్నాని (టెక్ మహేంద్ర సీఈఓ) భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయమై జగన్ చొరవ చూపారు. అవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. గౌతమ్ అదానీ తో పాటు మిత్తల్ కూడా మన వైపు పెట్టుబడుల రూపంలో తరలి వచ్చేందుకు ఆసక్తి చూపారు.
నిన్నటి వేళ ఆర్సిలర్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్ తో సమావేశం అయి గ్రీన్ ఎనర్జీ విభాగంలో 65 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో 33వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రొడ్యూసింగ్ కు మిట్టల్ కంపెనీ సానుకూలంగానే ఉంది. డీ కార్డనైజ్డ్ విద్యుత్ ఉత్పత్తిలో (కర్బన రహిత విద్యుత్ ఉత్పత్తి) ప్రపంచానికే ఏపీ ఆదర్శం అని నీతి అయోగ్ సీఈఓ సైతం నిన్నటి వేళ ప్రశంసించారు.
అంతేకాకుండా రూ.28వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు అరబిందో రియాల్టీ ముందుకువచ్చింది. తద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక్క గ్రీన్ ఎనర్జీకి సంబంధించే ఇప్పటిదాకా ఏపీకి 1.25 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు రానున్నాయి అని తెలుస్తోంది.