అమలాపురంలో హై అలర్ట్ విధించారు. సెక్షన్ 144 అమలు చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై 7 కేసులు నమోదు కాగా.. 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో 72 మందిని అరెస్ట్ చేయడానికి బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్ ఇల్లుల దగ్ధం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి దగ్ధం, మూడు బస్సులు దగ్ధంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డీజీపీ వెల్లడించారు. అదనపు బలగాలు చేరుకున్నాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం లేదన్నారు. నిన్నటి ఘటన అనుకోకుండా జరిగిన పరిణామంగా భావిస్తున్నామన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు గుమిగూడినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేట్ సేవలపై ఆంక్షలు విధించామన్నారు. గుంపులు గుంపులుగా తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.