ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. గత వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ల మంతనాలతో కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తన సమస్యలను వెల్లడిస్తానని ఆ సమయంలో తెలిపాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను 15 రోజుల పాటు వాయిదా వేశారు. నిన్న బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో సమావేశం అయ్యారు జగ్గారెడ్డి. ఈసమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై పునరాలోచించాలని నేతలు సూచించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు నియోజకవర్గ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు జగ్గారెడ్డి. కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీలో చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీని వీడితే కొత్త పార్టీని పెడతాను కానీ టీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేనది ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మెజారిటీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరారని.. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి తెలిపారు.