ఎన్టీఆర్‌ స్వగ్రామంలో వైసీపీ ఎత్తుగడ సక్సెస్ అవుతుందా !

-

ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు ఈ పేరు చెప్పగానే టీడీపీ శ్రేణులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. స్వర్గీయ ఎన్టీఆర్ సొంతూరు కావడమే దీనికి కారణం. ఎన్టీఆర్‌ నివాసంతోపాటు ఆయన బంధువులు, స్నేహితులు ఇంకా అక్కడే ఉన్నారు. పెద్దాయన కుటుంబసభ్యులు ఇప్పటికీ ఆ ఊరు వెళ్లి వస్తుంటారు. తన తాత గుర్తుగా ఇక్కడ భారీ విగ్రహాలు ఏర్పాటు చేశారు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ నిమ్మకూరు, ఎన్టీఆర్‌ అత్తవారి ఊరైన కొమరవోలు తరచు వార్తల్లో ఉండేవి. టీడీపీ ఓడిన తర్వాత ఈ రెండు ఊళ్లల్లో రాజకీయం వాడీవేడీగానే ఉంటోంది. నిమ్మకురు కేంద్రంగా కృష్ణాజిల్లా రాజకీయం మరోసారి వేడెక్కుతుంది.


నిమ్మకూరులో స్థానిక టీడీపీ కేడర్‌ బలంగా ఉండటంతో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుకు గత పదేళ్లగా వైసీపీ శ్రేణులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పరిసర గ్రామాల్లో మాత్రం వైఎస్‌ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు పామర్రు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారట. కొమరవోలుపైనా ఫోకస్‌ పెట్టి అక్కడి రాజకీయాన్ని వేడెక్కించే పనిలో ఉన్నారు ఎమ్మెల్యే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిమ్మకూరులో టీడీపీకి స్వల్ప ఆధిక్యం వస్తే.. కొమరవోలులో వైసీపీకి మెజారిటీ వచ్చింది.

ఈ రెండు గ్రామాల్లో వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉండే వైసీపీ శ్రేణులకు మరింత భరోసా ఇచ్చినట్టు అవుతుందనే లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌. పైగా ఈ పనిచేస్తే పార్టీలో తన ఇమేజ్‌ కూడా పెరుగుతుందని అనిల్‌ భావిస్తున్నట్టు సమాచారం. పాదయాత్రలో భాగంగా నాడు పామర్రులో ప్రసంగించిన జగన్‌.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతానని చెప్పారు. అలాంటప్పుడు ఎన్టీఆర్‌ పుట్టిన ఊరులో వైఎస్ఆర్ విగ్రహం కూడా ఉండాలి కదా అని చర్చ మొదలు పెట్టారు వైసీపీ కార్యకర్తలు.

నిమ్మకూరు గతంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నిమ్మకూరు పామర్రు పరిధిలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ గెలిచింది లేదు. 2014లో పామర్రు నుంచి YCP నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన తర్వాత టీడీపీలో చేరారు. అయినా మొన్నటి ఎన్నికల్లో తిరిగి వైసీపీయే పాగా వేసింది. ఏడాదిన్నరగా ఇక్కడ అధికార పార్టీ పూర్తిస్థాయిలో పట్టుకోసం పావులు కదుపుతోంది. ఇదే సమయంలో నిమ్మకూరు, కొమరవోలు గ్రామాల్లో వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసేస్తే ఓ పనైపోతుందనే ఆలోచనలో ఉన్నారట ఎమ్మెల్యే. మరి.. ఈ విగ్రహాల రాజకీయం వాటి ఏర్పాటుతోనే ఆగుతుందో.. లేక మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news