జమ్మలమడుగు వైసీపీలో కొత్త కుంపట్లు !

-

ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టు ఉంటాయి.. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ రాజకీయాలు.. అక్కడి నాయకుల ఎత్తుగడలు. గడిచిన దశాబ్దకాలంగా స్థానిక రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారాయి. నువ్వానేనా అనుకున్నవాళ్లు తెరమరుగయ్యారు. కొత్త నేతలు పుట్టుకొచ్చారు. ఇదే ఛాన్స్‌ అనుకున్నారో ఏమో ఎవరికి వారు ఎత్తకు పైఎత్తులు వేస్తూ తక్కువ టైమ్‌లోనే గుర్తింపు తెచ్చుకునే పనిచేస్తున్నారట. ఈ క్రమంలోనే జమ్మలమడుగు వైసీపీలో వర్గ రాజకీయాలు.. గ్రూపులు.. కొత్త కుంపట్లు రాజుకుంటున్నాయి.

జమ్మలమడుగు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ పాగా వేసింది. తర్వాత సీఎం జగన్‌ వైసీపీ జెండాను రెపరెపలాడించారు. అంతకుముందు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చుట్టూ ఇక్కడి రాజకీయాలు తిరిగేవి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జమ్మలమడుగులో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీకి జైకొట్టినా.. మరొకరికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చోటు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 50వేల మెజారిటీతో గెలిచిన ఆయన పూర్తిస్థాయి పట్టుకోసం అనేక వ్యూహాలు రచిస్తున్నారు.

సీన్ కట్ చేస్తే.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని ఆయన కోసం ఎన్నికల్లో పనిచేసిన స్థానిక వైసీపీ నేతలు ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారట. సొంత వారికే కాంట్రాక్టులు, పనులు ఇప్పిస్తున్నారని ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా కొత్త కుంపట్లు రాజేస్తున్నారని సమాచారం. ఇలాంటి వారంతా కలిసి తొందరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు వినికిడి.

ఈ విషయం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెవిలో పడిందట. వ్యతిరేక వర్గంపై ఆయన గుర్రుగా ఉన్నారట. ఈ మధ్యకాలంలో సిరాజుపల్లెలో సమీప బంధువు ఒకరు తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని ఆహ్వానించి చర్చలు చేస్తున్నారని తెలిసి మండిపడ్డారట. పోలీసులకు చెప్పి వారందరినీ హౌస్‌ అరెస్ట్‌ చేయించినట్టు జమ్మలమడుగు కోడై కూస్తోంది. ఇలాంటి చర్యలతో తమను మరింత రెచ్చగొడుతున్నారని రుసరుసలాడుతోందట ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం.

జమ్మలమడుగులో ఇప్పటికే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య అస్సలు పడటం లేదు. వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయామంటూ కొందరు స్థానిక నాయకులు మూడో వర్గాన్ని తయారు చేయడం కలకలం రేపుతోందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే లక్ష్యంగా వీరంతా పావులు కదిపితే పార్టీకి ఇబ్బందేనని భావిస్తున్నారట. సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే సమస్య తీవ్రమవుతోందని ఎమ్మెల్యేను ఉద్దేశించి కామెంట్స్‌ చేస్తున్నాయట వైసీపీ శ్రేణులు. మరి.. జమ్మలమడుగు కొత్త పంచాయితీకి పార్టీ పెద్దలు ఎలాంటి విరుగుడు మంత్రం వేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news