మూడు రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ..ఢిల్లీలో ఏం జరుగుతోంది ? రాష్ట్రాల సమస్యలు విన్నవిస్తున్నారా ..వ్యక్తిగత సమస్యలపై చర్చిస్తున్నారా ? రెండు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటనలు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రధానితోను, అమిత్ షాతోను మాట్లాడతారు. బీజేపీ రాష్ట్ర నేతలమోరాష్ట్ర ప్రభుత్వానికి వ్యకిరేకంగా మాట్లాడతారు. కొద్దిరోజులుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు, బీజేపీ వ్యూహాలు జనానికి అంతుబట్టకుండా ఉన్నాయి. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎవరి వాదనలు వాళ్లు చేస్తున్నారు. ప్రధాని కాళ్లు పట్టుకోవడానికే కేసీఆర్ ఢిల్లీ వచ్చారని బీజేపీ ఆరోపిస్తే.. అభివృద్ధి పై చర్చకు వచ్చారంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఆ రెండు పార్టీలూ ఒకటే మధ్యలో ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నారంటున్న కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కేసీఆర్ ఎక్కడా ఏం మాట్లాడటంలేదు.
ఇంతకీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు ..కేంద్రంతో రాజీకి కేసీఆర్ ప్రయత్నాలు చేశారన్న వాదనలో నిజం ఎంత ..కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై… వస్తున్న విమర్శలపై టిఆర్ఎస్ వాదనేంటి ? మూడు రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆ వెంటనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షా ను…ఆ తర్వాత మోదీని కలవడం పై అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్ర మంత్రులు హార్దిప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్ లతో కేసీఆర్ భేటీపై పెద్దగా చర్చ జరుగలేదు. టిఆర్ఎస్ , బీజేపీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని విమర్శించింది కాంగ్రెస్. ఇటు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలను తిప్పికోట్టింది టిఆర్ఎస్. రాజ్యాంగ బద్ధంగానే ప్రధాని మోదీని…సీఎం కేసీఆర్ కలిసారని టిఆర్ఎస్ స్పష్టం చేసింది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. గతంలో కూడా మోదీని కేసీఆర్ కలిసారని గుర్తు చేశారు సుమన్ .
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన రెండో రోజే ఏపీ సీఎం జగన్ కేంద్ర పెద్దలను కలవనుండటం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్లో మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన జగన్.. రెండు నెలల గ్యాప్ తర్వాత హస్తిన బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. హైకమాండ్ ని కలిసివచ్చాక.. బండి సంజయ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ త్వరలో జైలుకు పోవటం ఖాయమని ప్రకటించి సంచలనం రేపారు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఆయన వెళ్లి రాగానే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు కూడా కాల్ వస్తుందేమోననే చర్చ జరుగుతోంది.