రెండు తెలుగు రాష్ట్రాల్లో సిపిఐ నారాయణ అంటే తెలియని వారు ఉండరనే చెప్పాలి…ఎప్పుడు తనదైన శైలిలో మాట్లాడుతూ…ఏదొక వివాదంలో చిక్కుకోవడం నారాయణకు అలవాటే..అనూహ్యంగా వివాదాస్పద కామెంట్లు చేస్తూ…వివాదాలకు కేంద్రంగా ఉంటారు. అయితే సహజంగా నారాయణ శైలి అంతే..ఆయన మొహమాటం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఎదుట ఎలాంటి వ్యక్తి ఉన్నారనేది పట్టించుకోరు. అందుకే ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలు ఉంటాయి.
తాజాగా కూడా ఆయన చుట్టూ ఓ వివాదం నడుస్తోంది…ఈ మధ్యే ఆయన మెగా ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని తప్పుబట్టిన ఆయన…చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడంటూ హాట్ కామెంట్స్ చేశారు.
అసలు అల్లూరి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని నారాయణ ఫైర్ అయ్యారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ కామెంట్ చేశారు. ఇక నారాయణ ఈ తరహాలో మాట్లాడాక మెగా అభిమానులు నారాయణపై ఫైర్ అవుతున్నారు. ఇదే క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు సైతం..నారాయణపై విరుచుకుపడ్డారు. ఆయన గడ్డి తింటారు కాబట్టి అలా మాట్లాడతారని కాబట్టి జనసైనికులు…నారాయణకు కాస్త అన్నం పెట్టాలని అన్నారు.
ఇక సోషల్ మీడియాలో జనసేన శ్రేణులు…నారాయణపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు..ఇటు మెగా అభిమానులు కూడా విరుచుకుపడుతున్నారు. చిరంజీవిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నారాయణ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కోర్టుకు వెళ్తామని, నారాయణ నోటికి తాళం వేస్తామని అంటున్నారు. మొత్తానికైతే నారాయణని జనసేన శ్రేణులు, చిరంజీవి అభిమానులు గట్టిగానే టార్గెట్ చేశారు..ఇక దీనిపై నారాయణ క్లారిటీ ఇస్తూ…చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నారు. భాషా దోషంగా భావించి తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ సంబంధం ఉందని, రాజకీయంగా విమర్శలు చేయటం సహజమని అన్నారు. మరి ఇంతటితో ఈ వివాదం సద్దుమనుగుతుందో లేదో చూడాలి.