కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే కోనసీమకు అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పుడే అలా చేసి ఉండకపోతే ఇప్పుడు అమలాపురం అగ్నిగుండంలా మారేది కాదన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టడంలో ఎందుకు ఆలస్యం వహించారో తెలపాలన్నారు. అభ్యంతరాల స్వీకరణకు మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకు ఎందుకు సమయం ఇచ్చారని మండిపడ్డారు. గొడవలు జరగాలనే వైసీపీ అభ్యంతరాలకు సమయం ఇచ్చారా..? అని ప్రశ్నించారు.
ఎస్సీలలో బలం తగ్గుతోందని భావించి వైసీపీ నేతలే ప్లాన్ చేసి గొడవకు తెర లేపారన్నారు. నిన్న జరిగిన అల్లర్లలో తమ పార్టీ నేతలు ఉన్నారని హోంమంత్రి తానేటి వనిత చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. జిల్లాల పేర్లు పెట్టేటప్పుడు స్థానికుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములను ఒక జిల్లాకే పరిమితం చేశారన్నారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెడితే సహజంగా ఉంటుందన్నారు. ఎలాంటి అభ్యంతరాలు ఉంటే 30 రోజుల సమయం ఇచ్చి కలెక్టరేట్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జనసేనపై ఆరోపణలు చేస్తూ కుల సమీకరణపై రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.