వందేళ్లు బతకమని పెద్దోళ్లు ఈజీగా దీవిస్తారు కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని సంవత్సరాలు బతకడం కష్టమని మనందరికి తెలుసు.. 30 దాటడంతోనే రోగాలు..70-80 ఏళ్లకే ఆయుష్యు తీరిపోతుంది. ఇంకా ఈ గ్యాప్‌లో ఎలాంటి ప్రమాదాలు, ఆత్మహత్యలు జరగకపోతేనే. కానీ మీరు గమనించారో లేదో.. జపాన్‌లో సెంచరీ క్రాస్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అసలు ఈరోజుల్లో ఇది ఎలా పాజిబుల్.. ఇకిగాయ్‌తో పాజిబుల్ అంటున్నారు జపనీస్. ఈ కాన్సప్ట్ ఏదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా..? పేరు వింతగా ఉన్నా..పాటించేది అదేనండి..!
జపాన్‌లో సెంచరీ క్రాస్ చేస్తున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తుంది.. ఒక్క జపాన్‌లో మాత్రమే కాదు.. మిగతా ప్రాంతాల్లో వందేళ్లు కాదు.. 150 ఏళ్లు జీవించవచ్చని సింగపూర్‌కు చెందిన జెరో అనే బయోటెక్ సంస్థ పరిశోధకులు ఇచ్చిన రిపోర్టులో తేలింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఓ మనిషి గరిష్ఠంగా 120 నుంచి 150 ఏళ్ల దాకా బతకడానికి అవకాశాలున్నాయని ఆ శాస్త్రవేత్తలు అంటున్నారు.
గరిష్ట వయసు నిర్ధారించేందుకు రక్త కణాలు, జనాలు రోజూ చేస్తున్న పనులను సింగపూర్ సైంటిస్టులు విశ్లేషించారు. అమెరికా, బ్రిటన్, రష్యా ప్రజలపై అధ్యయనం చేశారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని రక్తకణాలు తగ్గడం మొదలవుతుందని… ఆ రక్తకణాలు ఎంత వేగంగా తగ్గిపోతే అంత వేగంగా వృద్ధాప్యం వస్తుంది.. అంతే త్వరగా మరణమూ సంభవిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ లెక్కన 120 నుంచి 150 ఏళ్ల మధ్యే రక్తకణాలు చాలావరకు తగ్గిపోయి శరీర పటుత్వం పడిపోతుందట.. కానీ సైంటిస్టుల పరిశోధనల్లో..హైలెట్ పాయింట్ తేలింది..అదేంటంటే..30 నుంచి 40 ఏళ్ల మధ్యే రక్తకణాలు తగ్గడం మొదలవుతుందట. తద్వారా శరీరం కొద్దికొద్దిగా శక్తిని కోల్పోతుంటుంది. ఆ వయసులో ఎదుర్కొనే ఒత్తిళ్లూ అందుకు కారణమవుతున్నాయని వారు అంటున్నారు..
ఏంటీ ‘ఇకిగయ్’ (’IKIGAI‘) కాన్సప్ట్..
జపాన్‌లో ‘ఇకిగయ్’ (’IKIGAI‘)అనే జీవన విధానం తీసుకువచ్చారు. ఇకిగయ్… అంటే, నిత్యం ఏదో ఓ వ్యాపకంలో బిజీగా ఉండటం. మనకు ఆనందాన్నిచ్చే పనేమిటన్నది తేల్చుకోగలిగితే చాలట.. ఒక్కసారి ఆ స్పష్టత వచ్చేయగానే… జీవితాన్ని మనం చూసే కోణమే మారిపోతుంది. తమ ఇకిగయ్‌కి దగ్గరగా ఉండే వృత్తి ఉద్యోగాల్ని ఎంచుకున్నవారే, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు.. ఇకిగయ్ అంటే.. అదేదో వైద్య విధానం కాదు.. జీవన విధానం. అలాంటి అలవాట్లు చేసుకున్నారు కాబట్టే.. జపాన్‌వాసుల ఆయుర్దాయం పెరుగుతోందట.
పదవీ విరమణ తర్వాత జపాన్‌వాసులు సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తారు.. సెకండ్ కెరీర్‌ను ఎంచుకుంటారు. వచ్చిన పని నచ్చినట్లు చేయడమే వందేళ్ల జీవితం. నచ్చని పని చేయడం అంటే నరకంతో సమానం.. పని అనే కాదు.. మనసుకు నచ్చనది ఏదీ చేయొద్దు. అది వేసుకునే బట్టలైనా, కట్టుకోబోయే భర్త అయినా ఏదైనా సరే. మీరు మీ మనసు బలంగా కోరుకున్న వృత్తిని ఎంచుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అవును ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని చేయాల్సి వస్తుంది. కానీ అదే శాశ్వతం కాదు కదా..మారడానికి ఒక్కరోజు చాలు.!
-Triveni Buskarowthu