ప్రతి పార్టీలో కీలక నేతలు ఉంటారు. రిమోట్ కంట్రోల్ లీడర్ షిప్ అన్నది ఆ రోజూ ఉంది ఈ రోజు కూడా ఉంటుంది. ఉండాలి కూడా ! నియంత్రిత వ్యవస్థ వేరు..నియంత వ్యవస్థ వేరు ! ఈ రెంటికీ తేడా ఎంతో ఉంది.. భాషకు సంబంధించి ఎవరు ఏం అయినా మాట్లాడి పేరు తెచ్చుకోవచ్చు .. నాలుగు ప్రాస పదాలు కేసీఆర్ వాడినా, కేటీఆర్ వాడినా అవి మీడియాకు మాత్రమే ఉపయోగపడతాయి కానీ ప్రగతిశీల ఆలోచనలను ఆచరణలో పెట్టాలంటే ముందు నాయకత్వాల తీరు మారాలి.
మారేందుకు కృషి చేయాలి. ఆ విధంగా తెలంగాణ వాకిట డమ్మీ నాయకత్వాలతోనే కాలం వెళ్లదీస్తోందని కాంగ్రెస్ ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించినా, మరొకటో ఇంకొంకటో అన్నా అదంతా ఆయన అపరిపక్వ ధోరణికి సంకేతం అనే అంటున్నాయి విపక్ష శ్రేణులు.
ఆ వివరం ఈ కథనంలో !
టెన్ జన్ పథ్ చుట్టూ ఒకనాడు కొందరు నాయకులు తిరిగారు. తెలంగాణ సాధనలో భాగంగా తిరిగి తమ డిమాండ్ ను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించారు. ఆ రోజు రాజ్యాంగేతర శక్తి అని ఎవ్వరూ సోనియాను భావించలేదు. రాహుల్ ను డమ్మీ లీడర్ అని కూడా అనలేదు. అప్పుడు అనాలని అనుకోలేదు కూడా ! అందుకు అప్పటి స్థితిగతులే కారణంగా నిలవవచ్చు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణలో ఇంటి పార్టీకి కొన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఎనిమిదేళ్ల పాలనకు సంబంధించి ఇప్పుడిప్పుడే తిరుగుబాటు మొదలయింది. వరంగల్ కేంద్రంగా నిన్నటి రాహుల్ సభ హిట్..ఆ మాటకు వస్తే శ్రీకాకుళం కేంద్రంగా చంద్రబాబు రోడ్ షో హిట్..ఇక్కడా,అక్కడా ఒక్కటే కామన్ పాయింట్ అదే అధికార పార్టీ నాయకుల ఉలిక్కిపాటు.
ఆ రోజు కేటీఆర్ ను కూడా కొందరు డమ్మీ లీడర్ అని అన్నారే ! మరిచిపోయారా అని కాంగ్రెస్ నాయకులు కౌంటర్లు దాఖలు చేస్తున్నారు. నాన్న చాటు బిడ్డ కేటీఆర్ అవును మా లీడర్ అమ్మ చాటు బిడ్డ అయితే మీరు నాన్న చాటు బిడ్డ మరిచిపోకండి అసలు వాస్తవం. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది మేమే అని ఎన్నో సార్లు కాంగ్రెస్ ను కీర్తించి కుటుంబ సమేతంగా అధినేత్రి సోనియాను కలిసిన సందర్భాన్ని మరిచిపోకండి. వాస్తవాలు మరిచి ప్రవర్తించడం మానుకోండి అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
మా నాయకుడు డమ్మీ అయితే మీరు కూడా డమ్మీనే అని సోషల్ మీడియా కేంద్రంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏదేమయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేటీఆర్ పనిచేయాలి. యాదగిరిగుట్ట నిర్మాణాలలో వైఫల్యాలను ఒప్పుకోవాలి. వాటిపై సంబంధిత సమర్థ ఉన్నతాధికార వర్గంతో శాఖ పరమైన విచారణకు ఆదేశించాలి. ఇవి కదా కావాలి.
ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఏమయిందో తెలుసు.. మళ్లీ ఆ కథ ఎందుకు తవ్వితీయడం.. టీడీపీ నాయకులనో, కాంగ్రెస్ నాయకులనో పార్టీలోకి తీసుకున్నప్పుడు కూడా ఏమయిందో తెలుసు.. వీటిపై మాట్లాడితే అదొక పెద్ద చర్చ అవుతుంది.. అవన్నీ వదిలి ప్రజా సమస్యలపైనే చర్చిద్దాం అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.