విజయవాడ నూతన కోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఈ కార్య్రమంలో సీఎం వైఎస్ జగన్, హైకోర్టు సీజే జస్టిస్ పీకే మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడిపోయాం అన్న ఆవేదన ఇక్కడి ప్రజల్లో ఉందని.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడిన తర్వాత నేను తెలుగులో మాట్లాడకపోతే బాగోదని.. తెలుగులో మాట్లాడటానికి చాలా ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.2013లో ఈ భవన సముదాయానికి శంఖుస్థాపన చేశానని.. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ కోర్టు భవన సముదాయాన్ని ప్రారంభించే అవకాశం నాకే వచ్చిందని తెలిపారు.
రాష్ట్ర విభజన, ఇతర కారణాల వల్ల భవన నిర్మాణం ఆలస్యం అయ్యిందని వెల్లడించారు. జ్యుడీషియరీ మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కేంద్రమే తీసుకోవాలని నేను కోరానని…. కేంద్రం నుండి కొంత వ్యతిరేకత వచ్చిందని.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపీ వంటి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నుంచి సహకారం అందిందని గుర్తు చేశారు.