జగన్, సజ్జల దిగజారిపోయారు : కళా వెంకట్రావ్‌

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే వినూత్న కార్యక్రమాలతో చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. చంద్రబాబుని మానసికంగా, భౌతికంగా దెబ్బతీయాలన్నదే తాడేపల్లి ప్యాలెస్ కుట్ర అని ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత ఆరోగ్య సమాచారాన్ని ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జగన్మో హన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు కళా వెంకట్రావు. 40 రోజులుగా టీడీపీ అధినేతను జైల్లో పెట్టి, కావాలనే చంద్రబాబు ఆరోగ్య సమాచారం బయటకు తెలియనీయకుండా వైద్యుల్ని, జైలు అధికారుల్ని కట్టడి చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.

చంద్రబాబుకి జైల్లో 14వ తేదీన వైద్యపరీక్షలు నిర్వహించిన వారు, నేటికీ ఆ పరీక్షల వివరాలు ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నించారు. “చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే, వాటికి సంబంధించిన రిపోర్టులు బయటపెట్టకపోవడాన్ని కుట్ర అనక ఏమనాలి? సొంత బాబాయ్ ను తన రాజకీయ ప్రయోజనాల కోసం చంపించిన వ్యక్తి, చంద్రబాబులాంటి గొప్ప నాయకుడి విషయంలో కుట్రలు చేయకుండా ఉంటాడా? ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కుట్రలకు నాంది పలుకుతుంటే, సకల శాఖల మంత్రేమో వాటిని అమలుచేయడంపై దృష్టి పెడుతున్నాడు. వారిద్దరి మాటలు, చేతలు చూస్తుంటే, వారు పూర్తిగా తాము ఉన్న స్థానాలు, వాటి తాలూకా బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారని అర్థమవుతోంది. తమ కుట్రల కోసం రాజ్యాంగ వ్యవస్థలనే వినియోగించుకునే స్థాయికి వారు దిగజారారు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికల్ని బయటపెట్టాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version