కన్నా లక్ష్మీనారాయణ ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. గుంటూరులో సుదీర్ఘకా లం ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. దివంగత వైఎస్‌కు నమ్మిన బంటుగా కూడా వ్యవహరించారు. ఈక్రమంలోనే కాంగ్రెస్‌లో ఉండగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే.. తర్వాత రాష్ట్ర విభజనతో ఆయన మౌనం పాటించారు. ఇక, తర్వాత వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినా.. చేరిపోదాం అనుకునే సరికి.. మాత్రం బీజేపీ నుంచి వచ్చిన బిగ్ ఆఫర్ ఆయనను కట్టిపడేసింది. అయితే.. ఇది అశనిపాతం అవుతుందని.. తనకు ఇబ్బందిగా మారుతుందని ఆయన ఊహించలేక పోయారు.
నిజానికి బీజేపీ గురించి తెలిసిన వారు ఆ పార్టీలో చేరేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పులుసు పిండేసి వదిలేసే టైపుగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ.. బీజేపీ గురించి ప్రచారం ఉంది. ఇప్పుడు కన్నా పరిస్థితి కూడా అలానే తయారైంది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించారు. ఆ తర్వాత కేంద్ర పదవి అన్నారు. రాజ్యసభకు పంపుతారని ప్రచారం చేయించారు. కానీ.. ఇప్పటి వరకు ఆయనకు అవకాశం లేదు. పైగా కేంద్రంతో అప్పాయింట్‌మెంట్ కోసం.. ఇటీవల ప్రయత్నించారు. ఆయనను ఫోన్‌ను లిఫ్ట్ చేసిన నాథుడు కనిపించలేదు.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి..? ఏ పార్టీఆయనను అక్కున చేర్చుకుంటుంది. బీజేపీలో ఉన్నప్పుడు.. అంతా తానే అనుకున్న ఆయనకు అధిష్టానం ఒకరకంగా చెప్పాలంటే.. అడ్రస్ లేకుండా చేసింది. ఇప్పుడు పార్టీలో ఆయనను పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ పరిణామాలతో కన్నా తీవ్ర మనస్థాపంలోఉన్నారు.
తన రాజకీయ భవితవ్యమే కాదు.. తన కుమారుడి భవితవ్యం కూడా ఆయనకు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు వైసీపీలో చేరదామన్నా.. ఆఫర్ ఇచ్చే నాథుడు కనిపించడం లేదు. ఒకవేళ వెళ్లినా.. రాజధాని విషయంలో ఆయనకు మామూలు సెగ తగలదు. కిం కర్తవ్యం? ఇప్పుడు కన్నాను ఆదేవుడే కాపాడాలి! ఇదీ.. ఇప్పుడు కన్నా గురించి గుంటూరులో జరుగుతున్న చర్చ.