కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బీజేపీలో చేరుతున్నారా. పార్టీ జాతీయ నేత ఆయనతో సంప్రదింపులు జరిపారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. టీడీపీ..వైసీపీకి భిన్నంగా ఏపీలో సామాజిక సమీకరణాలతో ఎదగాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. ఇద్దరి భేటీ బయటకు వచ్చిన స్టోరీ ఒకటైతే లోపల ఇంకేదో జరిగిందా బీజేపీలో చేరాలంటే ముద్రగడ వేస్తున్న లెక్కల పై ఇప్పుడు కమలనాథులు కుస్తీ పడుతున్నారట..
రాజకీయంగా ఏపీలో ఓ ప్రధాన సామాజికవర్గంపై గురిపెట్టిన బీజేపీ.. మిషన్ ఆపరేషన్‌లో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు ఏపీ బీజేపీ సారథి సోము వీర్రాజు. ఇది వ్యక్తిగత భేటీ కాదని తేల్చేశారు వీర్రాజు. ముద్రగడను బీజేపీలోకి ఆహ్వానించినట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలు.. ప్రస్తావనకు వచ్చిన అంశాలు.. షరతులు.. ప్రశ్నలు.. సమాధానాలపై రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది.
కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గం అండగా వస్తే మిగిలినవర్గాల ఓట్లతో రాష్ట్రంలో ప్రధాన పక్షంగా ఎదగాలన్నది బీజేపీ స్కెచ్‌గా కనిపిస్తోంది. ఏపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం..కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ..వైసీపీ లకు ప్రధానంగా అండగా నిలిచే రెండు వర్గాల కంటే భిన్నంగా కాపులను దగ్గర చేసుకోవలాని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే జనసేనను చేయిపట్టుకుని నడిపిస్తోంది. ఒకవేళ జనసేన దూరం జరిగితే.. కాపు సామాజికవర్గం ఓటర్లు జారిపోకుండా ముద్రగడకు గాలం వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.
కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని పీక్‌కు తీసుకెళ్లిన ముద్రగడ.. తనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలకు మనస్తాపం చెంది ఒక్కసారిగా ఉద్యమం కాడి వదిలేశారు. బీజేపీలో చేరేందుకే పోరాటం నుంచి తప్పుకొన్నారని అప్పట్లో చర్చ సాగింది. ఇప్పుడు ముద్రగడ కాదని అనుకున్నా.. కాపు రిజర్వేషన్ల పోరాటంపేరు చెబితే ఆయనే గుర్తుకొస్తారు. అందుకే ఆయనికి ఎలాగైనా కాషాయ కండువా కప్పేయాలన్నది బీజేపీ ఆలోచన. అయితే తాజా భేటీలో కాస్త నమ్మకం కుదర్చడానికి ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతతో వీడియో కాల్ మాట్లాడించారట సోము వీర్రాజు. గతంలో ఆంధ్రప్రాంతంలో పనిచేసిన ఆ సంఘ్ నేతకు గతంలోనే ముద్రగడతో పరిచయం ఉంది. ముద్రగడ కూడా ఒకప్పుడు కొంతకాలంపాటు బీజేపీలో పనిచేశారు.
తాజా భేటీలో కాపు ఉద్యమ నేతకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్టు సమాచారం. ముద్రగడ సీనియర్ రాజకీయ నేత. ఆయనకు తగిన రీతిలో ఆఫర్ లేకపోతే అంత తేలికగా బీజేపీ కండువా కప్పుకోరు. అలాగే కాపులకేం చేస్తారన్నది స్పష్టత కావలంటారు. . పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న కాపుల రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని.. అలాగే చేస్తే అట్టహాసంగా బీజేపీలో చేరతానని ఆయన హామీ ఇచ్చారట. దీనిపై కమలనాథులు ఆలోచనలో పడినట్టు సమాచారం. సమాచారంఅలాగే బీజేపీలో చేరితే కోస్తాలో తన అనుచరవర్గానికి ఎన్నికల్లో కొన్ని టికెట్లు కోరే అవకాశం ఉందట. మరి.. ముద్రగడ పెట్టిన షరతులు బీజేపీ ఎంత వరకు ఆమోదిస్తుందో చూడాలి….