బెంగళూరు: కర్ణాటక పీఠంపై బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు బసవరాజుతో గవర్నర్ గహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు. బసవరాజుతో పాటు ఉపముఖ్యంత్రులుగా మరో ముగ్గురు నేతలు ప్రమాణం చేశారు.. యడియూరప్ప రాజీనామాతో కర్ణాటకకు కొత్త సీఎంను కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు బసవరాజ్ బొమ్మై సీఎం బాధ్యతలు చేపట్టారు. కాగా ఇంజినీరింగ్ చదువుకున్న బస్వరాజ్ టాటా గ్రూప్‌లో ఉద్యోగం చేశారు. బసవరాజ్ తండ్రి ఎస్. ఆర్. బొమ్మై 32 సంవత్సరాల క్రితం కర్ణాటక సీఎంగా పనిచేశారు. జలవనరుల శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. తండ్రి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బస్వరాజ్.. హావేరి జిల్లా షిగ్గాన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. తొలుత జనతాదళ్ (యూ)లో బసవరాజ్ పని చేశారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న 22 మంది నేతలతో కలిసి 2008లో బీజేపీలో చేరారు. బస్వరాజ్ కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారేకావడంతో యడియూరప్పకు దగ్గరయ్యారు. యడియూరప్ప కేబినెట్‌లో హోంమంత్రిగా పని చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించారు.