కర్ణాటక ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ నడుస్తోందని ఆరోపించారు. ఏదైనా పని చేసినప్పుడు సామాన్య ప్రజల నుంచి 40శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్న సందర్భంలో సిద్ధరామయ్య ప్రధానికి బహిరంగ లేఖ రాశారు.
‘‘కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారింది. ప్రజలు, మీడియా దీన్ని 40 శాతం కమీషన్ సర్కారు అని పిలుస్తున్నారు’’ అని సిద్ధరామయ్య ఆరోపించారు. ప్రజాతీర్పును వ్యతిరేకిస్తూ మూడేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అవినీతి, తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు.
‘మీ మౌనం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ‘తినను..తిననివ్వను’ అంటూ అధికారం చేపట్టారు. అందరి అభ్యుదయమే ధ్యేయమన్నారు. ఇవన్నీ ఏమయ్యాయి? మీ మౌనంలో అర్థమేంటి? సామాన్య ప్రజల్ని లూటీ చేయండని మీ మంత్రులను ఉసిగొల్పుతున్నారా? ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కేబినెట్ నుంచి తొలగించే సత్తా మీకుందా?’’అని సిద్ధరామయ్య తన లేఖలో ప్రశ్నించారు.