కర్ణాటక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వరసగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో హిజాబ్ వివాదం రచ్చరచ్చ అవుతోంది. హైకోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. మరోవైపు 6 నుంచి 10 తరగతి వరకు సోషల్ స్టడీస్ లో ఉన్న టిప్పు సుల్తాన్ పాఠ్యాంశాల నుంచి కొన్ని అంశాలను తీసేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. హిజాబ్ తరువాత కర్ణాటకలో హలాల్ మాంసాన్ని బహిష్కరణ వివాదం మొదలయింది. హలాల్ మాంసాన్ని కొనవద్దని కొన్ని హిందూ సంస్థలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. కర్ణాటకలో ఉగాది తరువాత రోజు హొసతోడ జరుపుకుంటారు. హిందువులు ఆరోజు మాంసాన్ని తింటారు. అయితే రామనగర, మైసూరు, మాండ్య జిల్లాల్లో ఈ హొసతోడ జరుపుకుంటారు. అయితే ముస్లింల వద్ద నుంచి హలాల్ మాంసాన్ని కొనవద్దనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఇది ప్రభుత్వ ప్రకటన కాదని.. ప్రజలంతా గమనించాలని అన్నారు. ఇదిలా ఉంటే కొంతమంది బీజేపీ నేతలు మాత్రం హలాల్ అనేది ఆర్థిక జీహాద్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.